నితీష్ కుమార్ ఇటు బీజేపీకి సన్నిహితంగా ఉంటూనే మరోవైపు ఆ పార్టీ నిర్ణయాలను తిరస్కరించడంలో ముందుంటారు. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో గాని, రామమందిరం అంశంలో గాని ఆయన బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారు. బీహార్ లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనతాదల్ యు ల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయినా సరే నితీష్ తన రూటు వేరంటున్నారు. బీజేపీకి అక్కరకు వచ్చినప్పుడల్లా ఆయన ఎదురుతిరుగుతుండటం కమలం పార్టీకి మింగుడుపడని విషయమే.ఇదిలా ఉండగా తాజాగా ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి కూడా చర్చనీయాంశమయింది. ఎన్టీఏ ప్రధాని అభ్యర్థి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఇప్పటి వరకూ ఎవరికీ లేవు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రధాని అభ్యర్థిగ మోదీ మాత్రమే ఉంటారని భారతీయ జనతా పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు సయితం అంగీకరించే విషయమే. మోదీ మాత్రమే ఎన్డీఏను వచ్చే ఎన్నికల్లో గట్టున పడేయగలరన్న విశ్వాసం అందరికీ ఉంది.కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ జనతాదళ్ యు ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉన్నాడంటూ చేసిన ప్రకటన ఎన్టీఏలో చర్చనీయాంశమైంది. ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ సయితం రేసులో ఉన్నారని జేడీయూ చేసిన ప్రకటన ఎన్డీఏ మిత్రపక్షాల్లో కలకలం రేపుతోంది. జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ చేసిన ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బీహార్ అభివృద్ధికి నితీష్ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ఆయనను ప్రధాని అభ్యర్థిగా వివిధ పార్టీలు కోరుకుంటున్నాయని ఆయన తెలపడం చర్చకు దారితీసింది.ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంటూ మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ప్రకటనలు జోరుగా చేస్తున్న శివసేన సయితం ఈ ప్రతిపాదనకు ఓటేసేటట్లే కన్పిస్తుంది. కొన్నాళ్లుగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మోదీ, షాలపై మండిపడుతున్నారు. ఎన్నికల నాటికి శివసేనను తమ దారిలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో కమలం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో జేడీయూ చేసిన ప్రకటన శివసేనకు అందివచ్చేలా కన్పిస్తుంది. అయితే బీజేపీ మాత్రం జేడీయూ ప్రతిపాదనను తోసిపుచ్చింది. 2019 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా మోదీ మాత్రమే ఉంటారని బీజేపీ ప్రకటన చేయడం విశేషం. మొత్తంమీద ఎన్డీఏలోనూ ప్రధాని అభ్యర్థి ఎవరనేది చర్చరకు రావడం గమనార్హం.