బీజేపీకి జరగాల్సిన డ్యామేజీ అయిపోయింది. ఆ ఇద్దరే అంటూ వేలెత్తి చూపేశారు. భవిష్యత్తు భయానకమే అంటూ బెదిరించేశారు. వరసగా 11 రాష్ట్రాల్లో ఎన్నికల విజయాలను అందించినప్పుడు ప్రశంసించడానికి సందేహించిన పెద్దలు హిందీ రాష్ట్రాల్లో దశ తిరగబడటంతో తప్పంతా వారిమీదకే తోసేశారు. ఆ ఇద్దరే ఇప్పుడు పార్టీని 2014 లో అధికారంలోకి తేవడానికి ఏం చేయాలనే ప్రయత్నంలో పడ్డారు. అమిత్ షా, మోడీలు మళ్లీ నడుం బిగించారు. తమపై వ్యక్తిగతంగా విమర్శలు ఎక్కుపెడుతున్నవారు గెలుపు బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా లేరు. అద్వానీ వర్గానికి చెందిన నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీలను మోడీకి ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ఓటమి నుంచి పూర్తిగా కోలుకోలేదు. తన మనసంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. కాంగ్రెసు పార్టీ పూర్తికాలం కొనసాగలేకపోతే మళ్లీ ఎంపీ ప్రజలు తనకే అగ్రపీఠం కట్టబెడతారనే ఆశలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నప్పటికీ గడ్కరీ ని జాతీయ స్థాయి నేతగా పార్టీ శ్రేణులు గుర్తించడం లేదు. జనసమ్మోహక శక్తి లేదు. మిత్రులను కలుపుకుని పోయే లక్షణమొక్కటే అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. అదొక్కటే బీజేపీ విజయానికి సరిపోదు.పార్టీని ఉత్తేజితం చేయడానికి ప్రధాని మోడీ పార్లమెంటరీ బూత్ ల స్థాయి సమీక్షలకు శ్రీకారం చుట్టారు. దేశంలోని ఆరువందల పైచిలుకు జిల్లాల్లో బూత్ నాయకులను ఉద్దేశించి మాట్టాడాలనేది ఆయన లక్ష్యం. నాలుగు నుంచి ఆరుజిల్లాలను ఒక్కోసారి సమీక్షిస్తున్నారు. అయితే ఇవి ప్రీస్క్రీన్డ్ సమీక్షలుగా ముద్ర పడుతున్నాయి. ఎటువంటి ప్రశ్నలు, సందేహాలు లేకుండా చెప్పింది వినే తరహాలోనే ఉంటున్నాయి. భారతీయ జనతాపార్టీ పాలనలో ఎదురైన వైఫల్యాలు, మధ్యతరగతి ప్రజల నుంచి ఎదురవతున్న వ్యతిరేకత వంటి అంశాలను లేవనెత్తకుండా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా హైకమాండ్ కోణం నుంచే పార్టీని చూడాలనే భావనతో ఈ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఏపీకి సంబంధించి ప్రధాని నిర్వహించిన సమీక్షలో ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం పూర్తికి నిధుల వంటి ప్రధానాంశాలను దాట వేశారు. రాష్ట్రప్రభుత్వానికి 20 వేల కోట్ల వరకూ నిధులిచ్చామంటూ చంద్రబాబు నాయుడిపై రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలు కోరుకుంటున్న అంశాలకు సమాధానం చెప్పకుండా తమకు తోచిన సమాచారం ఇద్దామంటే ప్రజలు అంగీకరించడం కష్టమని పార్టీ కార్యకర్తలే పేర్కొంటున్నారు.ప్రధాని చాలా జాగరూకతతో వ్యవహరిస్తారు. కాంగ్రెసు హయాంలో సైతం మీడియా కొంత వామపక్షభావజాలంతో ఉంటూ వస్తోంది. మోడీ పాలన మొదలయ్యాక దానికి అడ్డుకట్ట వేయగలిగారు. కార్పొరేట్ సంస్థలను మీడియా రంగంలో ప్రోత్సహించి ప్రధానస్రవంతి లో గుత్తాధిపత్యం సాధించగలిగారు. ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా సంపాదక విధానాలను మార్చుకునేలా చేయగలిగారు. ఒకటి అరా వ్యతిరేక భావజాలం ఉన్న వార్తామాధ్యమాలు వివిధ రకాల న్యాయపరమైన వ్యాజ్యాల రూపంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఇంత సానుకూల మాధ్యమాలు ఉన్నప్పటికీ ప్రధాని అందుబాటులో ఉండటం లేదు. తాను చెప్పదలచుకున్నది మన్ కీ బాత్, విదేశీ పర్యటనలు, బహిరంగ సమావేశాలు, ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇంటర్వ్యూలు , మీడియా ఇంటరాక్షన్ అంతంతమాత్రంగానే ఉంది. గతంలో ప్రధానులు విదేశీ పర్యటనలకు మీడియాను వెంట తీసుకెళ్లి ప్రయాణంలో నేరుగా వారితో ఇంటరాక్ట్ అయ్యేవారు. మోడీతో ఆ చనువు లోపించింది. మౌనర్షిగా ముద్ర పడిన మన్ మోహన్, మైనారిటీ ప్రభుత్వాలను నడిపిన వికే సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవెగౌడ్ సైతం మీడియాకు అందుబాటులో ఉండేవారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మీడియాకు సమాధానాలిచ్చేవారు. ప్రస్తుతం మోడీకి, మీడియాకు మధ్య ఆరకమైన సాన్నిహిత్యం కరవు అయ్యింది.లోక్ సభ ఎన్నికల కోసం మోడీ సూచనల మేరకు ఎంపీలతోనూ, లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జులతోనూ అమిత్ షా భేటీ అవుతున్నారు. ప్రశ్నల రూపంలో నియోజకవర్గ పరిస్థితులు, అవకాశాలపై సమాచారాన్ని వారి నుంచి సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉండి మరోసారి నిలవాలనుకుంటున్న వారికి అగ్నిపరీక్ష పెడుతున్నారు. వారి వైఫల్యాలు, నియోజకవర్గ ప్రజలకు వారిపై ఉన్న అభిప్రాయం, వివిధ సర్వేలు చాటిచెబుతున్న సత్యాల వంటి వివరాలను షా వెల్లడిస్తున్నారు. కచ్చితంగా ఓడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ పోటీ చేస్తారా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్ లో 29 స్థానాలకు గాను 27 సీట్లు బీజేపీ గెలిచింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లలో భారీ తేడా కనిపించింది. కాంగ్రెసుకు ఎడ్జ్ దక్కింది. మరో ఏడు సీట్లలో మెజార్టీ భారీగా తగ్గిపోయే వాతావరణం కనిపించింది. వీటన్నిటినీ సమీక్షల్లో ప్రస్తావిస్తూ అభ్యర్థుల మార్పుపై సంకేతాలిచ్చేస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలోనూ దారుణంగా పడిపోయిన పార్టీ గ్రాఫ్ నకు అసెంబ్లీ ఫలితాలు దర్పణం పడుతున్నాయని షా నేతలతో పేర్కొంటున్నారు. పైకి ఏమి చెబుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో ఎంపీ స్థానాలకు భారీ మార్పులుంటాయని పార్టీ అగ్రనాయకులు స్పష్టం చేస్తున్నారు. మోడీ, షా పట్ల ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా ఈసారి ఎన్నికలకు మాత్రం వారి మాటే చెల్లుబాటవుతుందని, తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సంఘ్ మరోసారి వారికే అవకాశం ఇస్తుందని బీజేపీ చెబుతోంది.