కాంగ్రెస్ లో కొత్త జోష్ కన్పిస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ ఉత్సాహం ఎక్కువగా కన్పిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. మళ్లీ కోలుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు పర్చకపోవడం, మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తులు తమకు కలసి వస్తాయని భావించిన కాంగ్రెస్ లోకి క్రమంగా నేతలు వచ్చి చేరుతున్నారు. ప్రధానంగా విశాఖ జిల్లాలో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కన్పిస్తుందన్నది పార్టీ వర్గాల అంచనా.తొలినుంచి విశాఖ కాంగ్రెస్ కు అండగానే నిలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు పటిష్టమైన ఓటు బ్యాంకు, సమర్థమైన నేతలు ఉన్నారు.కాని 2014 తర్వాత క్యాడర్ చెల్లా చెదురై పోయింది. నేతలు తలోదారి పట్టారు. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ కు మిగిలిన నేతలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ద్రోణం రాజు శ్రీనివాస్ కాగా, మరొకరు టి.సుబ్బరామిరెడ్డి. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు వంటి నేతలు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరగా, కరణం ధర్మశ్రీ వంటి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక మాజీ మంత్రి బాలరాజు ఇటీవలే జనసేనలో చేరారు.తెలంగాణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు కలసి వచ్చాయనే చెప్పాలి. అక్కడ పొత్తుతో విజయం సాధించకపోయినా…వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు గ్యారంటీగా ఉంటుందన్న సంకేతాలు విన్పిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమిని కట్టాలని దేశ వ్యాప్తంగా తిరుగుతున్న చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో కూటమికి తూట్లు పొడవరన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తును బాబు కుదుర్చుకోకుంటే చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీలకు ఏం చెబుతారని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం.అందుకే విశాఖ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సీట్లతో కూడిన జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. విశాఖ జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటును కాంగ్రెస్ అడగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని తెలుస్తోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్, అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కరరావు, అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని కిశోర్ చంద్రదేవ్ కు ఇవ్వాలని టీడీపీని కోరనున్నారని చెబుతున్నారు. జిల్లాకు రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లు అడగాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు అధికారికంగా ఖరారయితే చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.