గ్రామ పంచాయతీలు అస్థిత్వం కోల్పోతున్నాయి. ఆదాయమే పరమావధిగా పట్టణీకరణ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తుండటంతో పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు అధికారాలకు అందనంత దూరంలో ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ అభివృద్ధికి సూచిక అనే మూలసూత్రాన్ని ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్థానిక పాలన సత్ఫలితాలనిస్తున్నాయి. దీనికితోడు సరళీకృత ఆర్థిక విధానాలు గ్రామీణ వికాసానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి.బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికారాలను వికేంద్రీకరించారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి 1964లో తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో 12వేల 918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే గ్రామ స్వరాజ్యం నేటికీ సంపూర్ణంగా అమలయ్యే పరిస్థితులు లేవు. 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ కారణంగానే ఏటా ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దివస్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత గ్రామాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదు. నిబంధనల ప్రకారం గ్రామ తొలిపౌరుడుగా సర్పంచే సర్వాధికారి. అయితే జన్మభూమి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో సర్పంచ్‌ల ప్రాముఖ్యత తగ్గింది. గతేడాది జూలై 31తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియటంతో ఆగస్టు నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. రెండు, మూడు గ్రామాలకు ఒకే అధికారి ఉండటంతో పాటు స్థానికంగా సమస్యలపై పట్టులేకపోవటంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. ఎన్నికలు జరిగేంత వరకు తమను కొనసాగించాల్సిందిగా సర్పంచ్‌లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నామినేటెడ్ పదవులకు పదవీకాలం పొడిగిస్తున్న ప్రభుత్వం ఎన్నికలు జరిగేంతవరకు సర్పంచ్‌లను కొనసాగిస్తే తప్పేంటనే వాదనలు వినవస్తున్నాయి. ప్రజలతో అనునిత్యం మమేకమవుతూ సమస్యల సత్వర పరిష్కారానికి సర్పంచ్‌లు చొరవ చూపుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి పడకేసింది. వార్డు సభ్యులు, సర్పంచ్‌లకు ప్రజలతో సత్సంబంధాలు ఉండేవి. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయటంతో గ్రామాల్లో గ్రూపుల పోరు తలెత్తుతోందని చెపుతున్నారు. వీటిని రెండు నెలల క్రితమే రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే జీవో జారీ కాకపోవటంతో కమిటీలు యథాప్రకారం కొనసాగుతున్నాయని సమాచారం. కొన్ని గ్రామాల్లో కార్యదర్శి ఎవరో తెలీని పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రామాల్లో వౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు, రోడ్లు వంటివి ఏర్పాటయ్యాయి. జన్మభూమి కమిటీలు ఆశించిన స్థాయిలో పనిచేయటంలేదని ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే ఐదు విడతలుగా జరిగిన జన్మభూమిలో కనీసం పింఛను మంజూరు చేసే అధికారం కూడా తమకు ఇవ్వలేదని మాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను స్థానిక సంస్థలకు బదలాయించాల్సి ఉండగా వాటిలో కొన్ని, అదీ నామమాత్రంగా కేటాయింపులు జరిపారు. ప్రాథమిక విద్య, అంగన్‌వాడీ, ప్రజాపంపిణీ, ఆరోగ్యం, చేపల పెంపకం, వాటర్‌షెడ్లు, రోడ్లు, కల్వర్టులు, సంతలు, మార్కెట్ల నిర్వహణతో మమ అనిపించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధుల్లో కోత పడుతోంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి సెస్సు రూ. 500 కోట్ల పైచిలుకు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి పంచాయతీకే కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. నరేగా నిధులతో వివిధ శాఖలను అనుసంధానం చేయటంతో పాటు కొద్దినెలలుగా ఇవికూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇంటిపన్నుతో మాత్రమే పంచాయతీలు సరిపెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయనే వాదనలు వినవస్తున్నాయి