సంక్రాంతి పండగ ప్రయాణాలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు...అక్కడ నుంచి విశాఖ మీదుగా శ్రీకాకుళం వరకూ వెళ్లే ప్రయాణికుల కోసం భారీ కసరత్తు చేస్తోంది. ఆయా పనుల్లో అధికారులు తలమునకలై ఉన్నారు. 2017లో 1226 బస్సులు నడిపి రూ.2 కోట్ల ఆదాయం విశాఖ ఆర్టీసీ సంపాదిస్తే ఈ ఏడాది ఏకంగా 1400 బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. సుమారు రూ.4 కోట్లకు పైగానే ఆర్టీసీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఛార్జీల మోత మోగించైనా పండగ వేళల్లో ఆదాయాన్ని పెంచుకోవాలన్న యోచన ఆర్టీసీ ఏటా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రయివేటు బస్సు ఆపరేటర్లు విశాఖ కేంద్రంగా ఛార్జీలను భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారు. మామూలు ఛార్జీకి రెండు నుంచి మూడు రెట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ మాత్రం ఆ మొత్తాలకు కాసింత తగ్గించి బస్సులు నడుపనుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపుగా అత్యధిక రద్దీ ఉండడంతో సుమారు 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుధేష్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ బాగా పెరగనుందని, దీన్ని తట్టుకుని ప్రజలకు అందుబాటులో వారి వారి ప్రాంతాలకు బస్సు సౌకర్యాలను పెంచేందుకుగానూ ఉన్నతాధికారులతో ప్రణాళికలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్యలో విశాఖ వరకూ ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకూ సుమారు 120 బస్సులు ప్రయాణాలు సాగించనున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌కు 63 బస్సులు (స్పెషల్) వేస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండగను పురష్కరించుకుని తమ తమ ఊళ్లకు పోయేవారితో విశాఖ నగరం ఈ నెల 15 సంక్రాంతి నాటికి పూర్తిగా ఖాళీ అవ్వనుంది. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తాయి. ఏటా ఇదే దృశ్యం కనిపించనుంది. 12వ తేదీ నుంచే ఆర్టీసీ బస్టాండుల్లో రద్దీ పెరగనుంది. విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వచ్చే జన రద్దీ 13, 14 తేదీల్లో అత్యధికంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగనుంది. మామూలు రోజుల్లో కనీసం 65 వేల మందికిపైగా ఈ రద్దీ ఉంటుంది. ఈ సంఖ్య పండగ నేపథ్యంలో అదనంగా మరో 15 వేలకు పెరగనుందని తెలుస్తోంది.. జిల్లాలోని 10 ఆర్టీసీ బస్ డిపోల నుంచి 1054 బస్సులు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. మరో 400 బస్సులు పండగ ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్లపైకి రానున్నాయి. తూర్పుకోస్తా రైల్వే శాఖ విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండు సువిధ స్పెషల్ రైళ్లను తిప్పుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా భువనేశ్వర్ - సికింద్రాబాద్ ను పండగలో నిర్వహించడానికి సిద్ధమైంది. హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లను పండగ సమయాల్లో ఏర్పాటు చేస్తోంది. రైలు నెంబరు 08507 భువనేశ్వర్ - సికింద్రాబాద్ ఈ నెల 10, 17 తేదీల్లో 16 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి విశాఖకు 22.30 గంటలకు చేరనుంది. మరలా ఈ రైలు 23 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు 12 గంటలకు మరుసటిరోజు చేరనుంది. తిరుగు ప్రయాణంలో 08508 సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే హంసఫర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో 16.30 గంటలకు 11, 18 తేదీల్లో బయల్దేరి విశాఖపట్నంకు మరుసటి రోజు 4.50 గంటలకు చేరనుంది. మరలా 05.15 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్‌కు బయల్దేరి 11.30 గంటలకు చేరనుంది. ఈ రైళ్లు ఖుర్దా రోడ్డు, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట మధ్య భువనేశ్వర్, సికింద్రాబాద్ మార్గాల్లో ప్రయాణం చేయనుంది.