పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టు గిన్నీస్ రికార్డు ల్లోకి ఎక్కడం చాలా సంతోషంగా ఉంది. 32 వేల 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం గొప్ప విషయం. దేశమంతా గర్వపడి, తెలుగు వాడి సత్తాను అభినందిస్తుంటే జగన్ ఓర్వలేక పోతున్నాడని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. గిన్నీస్ రికార్డు పేరుతో నాటకం అంటూ తన అవినీతి పత్రికలో విషం చిమ్మడం దుర్మార్గం. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు, ,24గంటల శ్రమను అవమానించాడు. మంచిని కూడా అంగీకరించలేని మానసికవ్యాధితో జగన్ బాధ పడుతున్నాడు. చంద్రబాబు ను తిట్టకుండా, సిఎం సీటు పై కలలు కనకుండా జగన్ కు రోజు గడవదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చంద్రబాబు నిధులు కేటాయించి పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా జగన్ నోరు తెరవడు. కోర్టులో కేసులు కూడా వేయించి పోలవరం అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేశాడు. ఇంత నీచంగా దిగజారి జగన్ వ్యవహరించి తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. సిఎం పదవి పిచ్చి పట్టిన జగన్ కు ఆ కుర్చీ తప్ప మంచి ఏది కనిపించడం లేదని అన్నారు. నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతుంది. మోడిని కానీ, కేంద్రం ను కానీ జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదు. మోడి, కేసిఆర్ లతో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తూ ఎపి ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు. అవినీతి కేసులో ఎ1, ఎ2 ముద్దాయిలు గా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి లు పోలవరం పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవ చేసారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేస్తూ దష్ప్రచారం చేస్తున్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు, ఇంజనీర్లు, నిపుణులు సమక్షంలో పనులు చేశాం. 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే జగన్ తన పత్రికలో పూత అని రాసాడు. తన స్వార్ధం కోసం గిన్నీస్ రికార్డ్ ను కూడా తప్పు పట్టేలా పిచ్చి కధనం రాశాడని విమర్శించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పట్టిసీమ లేకపోతే నేడు డెల్టా లేదు. దానిని కూడా నువ్వు సమర్ధించ లేదు. కృష్ణా డెల్టా లో రెండు పంటలతో పాటు, రాయలసీమ కు నీరు ఇచ్చి చూపాం. రాయలసీమ రతనాల సీమ చేసేందుకు సిఎం తపన పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో జల హారతి ఇచ్చి చంద్రబాబు నీటిని తీసుకు వస్తున్నారు. చంద్రబాబు ప్రణాళిక ల వల్లే నేడు అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. 10 వేల 449 కోట్ల రూపాయల పోలవరం పనులు చేస్తే 25వేల కోట్లు అవినీతి జరిగిందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. మోడి, కేసిఆర్ డైరెక్షన్ లో జగన్ చంద్రబాబు పై కుట్రలు చేస్తున్నారు. నీలాంటి వాళ్లు ఎంతమంది అడ్డుపడినా చంద్రబాబు పోలవరం పూర్తి చేసి రైతాంగానికి కానుకగా అందిస్తారని అయన అన్నారు.