రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కోస్గి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధిపథంలో నడిపించనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటైనందున కర్నూలు లో బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జలధార ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కర్నూల్ జిల్లాలో 97 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేశామన్నారు. మిగిలిన రెండు త్వరలో పూర్తి చేస్తామని సీఎం స్సష్టం చేశారు. కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు నడిచేలా చూస్తానని చెప్పారు. ఓర్వకల్లు పెద్ద పారిశ్రామిక వాడగా మారనుందని, దాదాపు 200 నూతన కంపెనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. గని ఆల్ట్రా మెగాపవర్ సోలార్ పార్క్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద పార్క్ అని చెప్పారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు.