పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఓటరు జాబితాలో పేర్లు నమోదుకు చేసుకోవడానికి ఈ నెల 31వరకు గడువు ఉందని ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పేరు నమోదు చేసుకోని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుకు భారతీయ పౌరుడై ఉండాలనీ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో సాధారణ నివాసి అయి ఉండాలని తెలిపారు. 2018 నవంబర్ 1 నాటికి మూడేళ్ల ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన వారే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. నియోజక వర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-18 పూరించి, కలర్ పాస్పోర్టు సైజు ఫొటో, డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జిరాక్సుపై గెజిటెడ్ అధికారితో సంతకం చేసి సంబంధిత తహసీల్దార్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు 2012-18 మద్య కాలంలో మూడేళ్ల బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఓటర్లు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. వృత్తిలో ఉన్నవారు (ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల) సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఫారం-19దరఖాస్తు నింపి సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా తహసీల్దార్ లే ఎంపీడీవో లేదా ఎంఈవో కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాల బోధనా సిబ్బంది దరఖాస్తులను సంబంధిత ప్రిన్సిపాల్ ఒకేసారి సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 31అని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.