YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ పై చర్చ

 అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ పై చర్చ
అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిప 124వ రాజ్యంగ సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్ సభలో ప్రవేశపెట్టారు.. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల్లో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఈబీసీ బిల్లు అంశంపై ఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..సభ చివరి రోజు ఇలాంటి బిల్లును తీసుకొచ్చి బీజేపీ గందరగోళం సృష్టించిందన్నారు. ఈబీసీ బిల్లులో పలు సవరణలు చేయాలని మా పార్టీ తరపున కోరతామన్నారు. బిల్లులో సవరణలు చేసి తెలంగాణ డిమాండ్లు నెరవేర్చాలని కోరనున్నట్లు చెప్పారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాలపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు.కేంద్రం రిజర్వేషన్ల పెంపును చేపట్టినందు వల్ల రాష్ట్ర తీర్మానాలను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తామని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బిల్లులపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉన్న అంశాలన్నింటినీ ఈ రాజ్యాంగ సవరణలో పెట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని ఎంపీ వినోద్ కుమార్ కోరారు. తెలంగాణ శాసనసభ చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించాలన్నారు.వాస్తవానికి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో 2/3 వంతు మెజారిటీ అవసరం.జనరల్‌ విభాగంలో ఆర్థికంగా వెనకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. కేంద్రం ప్రకటించిన ఈ రిజర్వేషన్ల వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ లాంటి సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5 శాతం రిజర్వేషన్లకు ఇది అదనం. దీంతో మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరుకుంటాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రవర్ణాలను ప్రసన్నం చేసుకోడానికి మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, లోక్‌సభలో పౌరసత్వ బిల్లుపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ చర్చ ప్రారంభించారు. జాతీయ పౌర గణన విషయంలో ఎలాంటి వివక్షతకూ తావులేదని, అక్రమ వలసదారుల విషయంలో అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని అన్నారు. పౌరసత్వ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ సందర్భంగా ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వ ఓటుబ్యాంకు రాజకీయాలకు ఈ బిల్లు ఓ ఉదాహరణ అంటూ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. అంతేకాదు, దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ఆమోదించి, దేశాన్ని విడగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సౌగత్ రాయ్ ధ్వజమెత్తారు

Related Posts