ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రోజుకో వార్త రాష్ట్రంలో సంచలనం అవుతోంది. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడితో రాజకీయం రంజుగా మారుతోంది. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. రేపోమాపో తొలి జాబితాలను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో నూట్రల్‌గా ఉన్న పలువురు సీనియర్ నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. గతంలో చక్రం తిప్పిన వాళ్లను తమ పార్టీల్లో చేర్చుకుంటే మైలేజ్ వస్తుందనే ఆలోచనతో బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అంతేకాదు, సామాజిక సమీకరణాలు బేరీజు వేస్తూ కుల సమీకరణల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చెయ్యగల నాయకులను బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు ఇదే కోవలోని వచ్చి చేరింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కొద్దినెలల కిందట తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో కాపు రిజర్వేషన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి ఆ సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నాడు వైసీపీ అధినేత. అందుకే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాడట.కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకోబోతున్నాడని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాపు రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేస్తూ ఆ సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న ఆయన.. వైసీపీకి అనుకూలమనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అంతేకాదు, ఆయన ఆ పార్టీలో చేరుతున్నారని, ఇందుకు గానూ ముద్రగడకు కాకినాడ వైసీపీ టికెట్ ఇస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యల తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. కాపు సామాజకవర్గం వైసీపీకి దూరమవుతున్న తరుణంలో ఆ పార్టీలో చేరితే అధికార పార్టీ ఆరోపణలు నిజమయ్యే అవకాశం ఉండడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఇదే కారణంతో జగన్.. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోనే ఎంతో ముఖ్యమైన కాపు సామాజికవర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ముద్రగడను వాడుకోవాలని జగన్ ప్లాన్ చేశాడట. అందుకే ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తానని ఆఫర్ చేశాడని సమాచారం.