341 రోజులు… 3,648 కిలోమీటర్లు… 231 మండలాలు… 54 మున్సిపాలిటీలు… 8 నగరాలు… 2,516 గ్రామాలు… 124 బహిరంగ సభలు… ఈ లెక్కలు చాలు పాదయాత్ర చేయాలనుకున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఎంత బలమైనదో చెప్పడానికి. తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో 2017 నవంబర్ 6న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర జగన్ ను నాయకుడి స్థాయి నుంచి ఒక మెట్టు ఎక్కించి ప్రజా నాయకుడిగా మార్చింది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో చేసిన ఈ భారీ పాదయాత్ర ప్రజల్లో కలిసిపోవడానికి… రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవడానికి… ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి… వాటికి పరిష్కారాలను అర్థం చేసుకోవడానికి జగన్ కి లభించిన ఓ మంచి అవకాశం. లభించిన అవకాశం కాదు… ఎంతో ధైర్యంతో… ధృడ సంకల్పంతో జగన్ కల్పించుకున్న అవకాశం. పాదయాత్రలు నాయకులను ప్రజలకు చేరువ చేస్తాయి. వినోభా బావే భూదానోద్యమంలో సుమారు 8000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మహాత్మా గాంధీ కూడా అహ్మదాబాద్ నుంచి దిండి వరకు దిండి మార్చ్ చేశారు. ఈ రెండు ఘట్టాలను చరిత్రలో లిఖించబడ్డాయి. ఇక, మన రాష్ట్ర రాజకీయాలకు వస్తే వైఎస్ చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తర్వాత ఆయన కూతురు షర్మిల 3,112 కిలోమీటర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హిందూపురం నుంచి విశాఖపట్నం వరకు 2,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.పాదయాత్రకు ముందు పార్టీ పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితిని చూస్తే పాదయాత్ర జగన్ కి ఎంత మేలు చేసిందో అర్థమవుతుంది. ఓ వైపు పార్టీ ఫిరాయింపులు, ప్రత్యర్థుల వ్యతిరేక ప్రచారాలతో ఢీలా పడిపోయిన పార్టీకి జగన్ పాదయాత్ర ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వైసీపీ పని అయిపోయినట్లే అనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ ఏ జాతీయ సంస్థ సర్వే చేసినా జగన్ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తారనే ఫలితాలు వస్తున్నాయంటే అందుకు కారణం పాదయాత్రనే. జగన్ ప్రజా సంకల్పయాత్ర రానున్న ఎన్నికల్లో ఆయన జైత్రయాత్రగా మారుతుందనే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆయనకి సానుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పాదయాత్ర ప్రారంభించే ముందు ఆరు నెలల్లో పూర్తవుతుందని జగన్ సహా వైసీపీ నేతలు అంచనా వేశారు. కానీ, ప్రజల్లో నుంచి మంచి స్పందన రావడంతో సమయం పెరుగుతూ పోయి ఇవాళ తండ్రి, సోదరి పాదయాత్ర పూర్తయిన ఇచ్ఛాపురంలోనే జగన్ పాదయాత్ర ముగిసింది. జగన్ కి ప్రజలతో కలిసిపోవడం కొత్తేమీ కాదు. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం జగన్ ను మాస్ లీడర్ గానే గుర్తిస్తారు. ఇక, పాదయాత్ర ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. పాదయాత్ర చేసిన దారంతా ఆయన ప్రజలతో మమేకమవుతూ.. ముచ్చటిస్తూ, ఫోటోలు దిగుతూ, కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకుసాగారు. ఆయన పాదయాత్ర ఏ గ్రామం నుంచి వెళ్లినా ఆ గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది. అయితే, తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరూ ఊహించని విధంగా పాదయాత్రకు ప్రజల్లో నుంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ వారధి, రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిపై ఆయన పాదయాత్రకు వచ్చిన స్పందన ప్రత్యర్థులకు కూడా గుబులు పుట్టించింది.మండల కేంద్రాలు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ఆయన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అలా 123 బహిరంగ సభలు పూర్తి చేసుకున్న ఆయన ఇవాళ చివరి బహిరంగ సభ… ముగింపు సభ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించారు.రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలుగా ఉండి పాదయాత్రలు చేసిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులయ్యారు. మరి, జగన్ కూడా ఈ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటారో లేదో చూడాలి.