YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విన్నింగ్ పాయింట్స్ లో మోడీ 20 కోట్ల మందిని ఆకట్టుకొనే బ్రహ్మస్త్రం

విన్నింగ్ పాయింట్స్ లో మోడీ 20 కోట్ల మందిని ఆకట్టుకొనే బ్రహ్మస్త్రం
పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్…మాస్టర్ స్ట్రోక్…గేమ్ ఛేంజర్…పేరు ఏదైనా పెట్టుకోండి. రాజకీయంగా గెలవడమెలాగో తెలిసిన సీజన్ డ్ పొలిటికల్ మాస్టర్ మోడీ. విన్నింగ్ పాయింట్స్ ఆయనికి తెలిసినట్లుగా ఆధునిక రాజకీయాల్లో మరెవరికీ అంతుచిక్కవు. ఆటను ఎలా మలుపు తిప్పాలో, ఏ ఎత్తు వేస్తే విజయం పాదాక్రాంతమవుతుందో బాగా వంటపట్టించుకున్నారు. భిన్నరాజకీయ శక్తుల సమాహారమైన భారతావనిలో ప్రత్యర్థులను బెంబేలెత్తించే కళ లో ఆరితేరిపోయాడు. పార్టీకి పడిపోతున్న గ్రాఫ్ తో గత కొంతకాలంగా నేతలంతా 2019 ఎన్నికల్లో గట్టెక్కడమెలా? అంటూ అంతా తలలు పట్టుకు కూర్చున్నారు. మోడీ చాప్టర్ క్లోజ్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రాముడిని నమ్ముకోవాలా? రైతును నమ్ముకోవాలా? పార్టీలోనే ప్రత్యామ్నాయ నేతను పైకి ఎత్తి పట్టుకోవాలా? అంటూ పరిపరి విధాల బుర్రలు చించుకుంటున్న అంతర్గత అసమ్మతి వాదులకు దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చారు ప్రధాని. ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ శల్యులకూ చెక్ పెట్టేశారు. ఆధునిక రాజకీయ క్రీడలో తాను ఎంతటి నైపుణ్యం కలిగిన ఆటగాడో తేల్చి చెప్పేశాడు.కొడితే పైకి లేవకుండా కొట్టాలి. దెబ్బతిన్నవాడు సైతం కిమ్మనకూడదు. అదీ రాజకీయం. అన్నిసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఎలా ఎన్నికయ్యారు?అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఉచిత పథకాలు, రాయితీలు, సంక్షేమం పేరిట పప్పుబెల్లాలుగా ప్రభుత్వ నిధులను పెద్దగా పంచిపెట్టిన దాఖలాలు లేవు. అయినా వరసగా ఎన్నికయ్యారు. అదే స్కీమును ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. 2014లో ప్రజల్లో ఆశలు రేకెత్తించడం ద్వారా బాగా ఆకట్టుకున్నారు. యువత, మధ్యతరగతి నీరాజనాలు పట్టి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ఆశలు ఆవిరై పోవడంతో ఈసారి అధికారం కష్టమేనన్న భావన వ్యాపించింది. ఈ సమయంలోనే తన చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడినవారికి రిజర్వేషన్లు అంటూ ఆశలపందిరిని చిగురింపచేశారు. అగ్రవర్ణాలకు చెందిన యువత చాలాకాలంగా తీవ్రమానసిక క్షోభలో ఉంది. ఉద్యోగం , విద్య విషయాల్లో తాము తీవ్రంగా నష్టపోతున్నామనే భావన పెరిగిపోయింది. వెనకబడిన వర్గాలు, ఎస్సీ,ఎస్టీలకు వారు వ్యతిరేకం కాదు. ఆయా వర్గాల్లో ఐఏఎస్, ఐపీఎస్ , ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నత స్థానానికి చేరుకున్న వారి పిల్లలు, మనమలు సైతం రిజర్వేషన్లు పొందుతున్నారు. మరోవైపు కూటికి లేక ఇబ్బందులు పడుతున్నా రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదనే నిరాశానిస్ప్రుహలు అగ్రవర్ణ యువతను వెన్నాడుతున్నాయి. ఒక రకంగా రాజకీయ నాయకులపట్ల కసితో రగిలిపోతున్నారు. ఈ పాయింట్ ను సరైన టైమింగ్ లో క్యాచ్ చేశారు మోడీ.రైతు రుణమాఫీ, రైతుకు పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం వంటి అనేక పరిష్కారాలతో పడిపోతున్న కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలని సూచనలు వెల్లువెత్తాయి. మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యయమయ్యే ఆయా పథకాల వల్ల ప్రయోజనం కంటే ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మోడీ భావన. బ్యాంకింగు వ్యవస్థ పరపతి కోల్పోతుంది. భవిష్యత్తులో రైతులకు వ్యవస్థాగత రుణాలు పుట్టవు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఖజానా బాగా దెబ్బతింటుంది. కేవలం ఓట్ల కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మోడీకి సుతరామూ ఇష్టం లేదు. అందుకే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల అంశాన్ని కదిపారు. ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. బీజేపీకి అగ్రవర్ణాలు గట్టి మద్దతుగా నిలిచే అవకాశాలు ఏర్పడతాయి. ఇంతవరకూ ఒకే ఒక సందర్భంలో పీవీ నరసింహారావు ఆఫీసు మొమోరాండం పేరిట అగ్రవర్ణాల రిజర్వేషన్ కు ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. అప్పట్నుంచి మళ్లీ ఎవరూ దాని జోలికి పోలేదు. అగ్రవర్ణాల యువతలో మాత్రం అసహనం బాగా పెరుగుతోంది. ఎవరిని పలకరించినా ఈ దేశంలో తమను రాజకీయ నాయకులు పట్టించుకోరనే ఆ్రకోశం వెలిబుచ్చుతారు. అటువంటి వారిని లక్ష్యంగా చేసుకుంటూ రిజర్వేషన్ల అస్త్రాన్ని బయటికి తీశారు. ఇది ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకించలేని ఒక ఆయుధం. 2019 ఎన్నికలకు దీనిని వాడుకొంటే చాలు చక్కగా గట్టెక్కేయవచ్చనే అంచనా. దాదాపు 20 కోట్ల మంది వరకూ అగ్రవర్ణాలకు చెందిన వారిని ఈ ఒక్క నిర్ణయం ప్రభావితం చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.వెనకబడిన తరగతులకు చెందిన కొన్ని సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే వారి రిజర్వేషన్లకు భంగం లేకుండా అమలు చేస్తామని ముందుగానే హామీ ఇచ్చేశారు. అయితే దీర్ఘకాలంలో ఇది రిజర్వేషన్ రహిత భారతావని కోసం ప్రయత్నాలకు నాందిగా కొందరు పేర్కొంటున్నారు. ఆర్థికంగా వెనకబాటు తనం అనే కొలబద్ద ను ప్రమాణంగా తీసుకోబోతున్నారు. భవిష్యత్తులో ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల్లో సైతం ఆర్థికంగా వెనకబాటు తనాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ తమ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు చెంది రిజర్వేషన్ల ద్వారా ఉన్నతస్థాయికి చేరుకున్నవారు తమ పిల్లలకు మంచి విద్యావకాశాలు కల్పిస్తున్నారు. వారు సాధారణ విద్యార్థులతో పోటీ పడే స్థితిలో ఉంటున్నారు. గ్రామప్రాంతాలు, పేదరికంతో ఉండే రిజర్వేషన్ వర్గాల పిల్లల అవకాశాలకు వారు గండి కొడుతున్నారు. అందువల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో సైతం ఆర్థిక ప్రమాణాన్ని పెడితే అర్హులకు నిజమైన ప్రయోజనం సమకూరుతుంది. లేకపోతే రిజర్వేషన్లు పొందినవారే మళ్లీ మళ్లీ పొందుతున్నారు. వాటిని అందుకోలేక ఆపసోపాలు పడుతున్న రిజర్వుడ్ వర్గాలు మాత్రం అభివ్రుద్ధికి ఆమడ దూరంలోనే పేదరికంలోమగ్గిపోవాల్సి వస్తుంది. ఈ కారణంగానే తాజా పరిణామం కొత్తడిమాండ్లకు ఆస్కారం కల్పిస్తుంది. భారతావని రిజర్వేషన్ చరిత్రలో టర్నింగ్ పాయింట్ గా మారబోతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Related Posts