ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్న జగన్.. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వేదపండితులతో పాటు మతపెద్దలు ఆయనకు అశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలకు జగన్ చేతులెత్తి అభివాదం చేశారు. ఉత్తరాంధ్రతో పాటూ కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇచ్ఛాపురం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కాసేపట్లో జగన్ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో 341 రోజులు పాటూ సాగిన యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జగన్. రైతులు, మహిళలు, యువతకు భరోసా కల్పిస్తూ రూపొందించిన ఏడు పథకాల ప్రాముఖ్యతను వివరించారు. మొదటి రోజు నుంచి పాదయాత్రలో ప్రతి నియోజకవర్గం, గ్రామాల్లో సమస్యలపై ఆరా తీశారు. స్థానిక ప్రజలు.. ముఖ్యంగా నిరుపేదులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలతో మమేమకమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే.. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇచ్ఛాపురం సభ ముగిసిన అనంతరం ఆయన రాత్రికి విజయనగరం చేరుకున్నారు. అక్కడ నుంచి రైల్లో తిరుపతికి వెళ్లారు గురువారం ఉదయం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. జనవరి 11న ఉదయం తిరుమల నుంచి నేరుగా కడప చేరుకుని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. తర్వాత పులివెందుల చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. చివరగా ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడ వైఎస్ సమాధికి నివాళులర్పిస్తారు. దీంతో ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర తిరిగి అక్కడే ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.