ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నేడు ఇచ్చాపురంలో ముగిసింది. ఈ రోజు మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్ర ముగించిన జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యేక్షంగా వీక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దయెత్తున ఇచ్చాపురం చేరుకున్నారు. సాయంత్రం మూడు గంటలు దాటిన తరువాత పైలాన్ దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ నేతలు జగన్ను అభినందించడానికి ఆయనతో చేతులు కలపడానికి పోటీలు పడ్డారు. జయజయ ధ్వానాలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డిని విజయ సంకల్ప స్ధూపం దగ్గరకు ఆహ్వానించారు. అనంతరం ఆయన ఐఫిల్ టవర్ ఆకారంలో నిర్మించిన విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించారు. స్తూపం ఆవిష్కరించడానికి ముందు పాదయాత్ర ముగించిన జగన్మోహన్ రెడ్డికి వేదపండితులతో పాటు మతపెద్దలు అశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలకు జగన్ చేతులెత్తి అభివాదం చేశారు. పాదాయత్ర 2017, నవంబర్ 6న ఇడుపుల పాయలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమయింది. ఇందులో భాగంగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు మేర జగన్ నడిచారు.