విజయవాడకి మరో ఐకానిక్ స్ట్రక్చర్ రాబోతుంది. చెన్నై-కోల్కతా మహానగరాలను కలిపే జాతీయ రహదారి పై పై జంట నగరాలను కలిపే కూడలి వారధి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అత్యంత సుందరంగా రూపుదిద్దుకోనుంది. వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ కూడలిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతోపాటు ఆకర్షణీయమైన పచ్చదనంతో నేత్రపర్వం చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్టనుంది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు ఆ దిశగా కసరత్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు రెండు డిజైన్లను సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి అమరావతి చారిత్రక వారసత్వానికి దర్పణం పట్టనుండగా, మరొకటి సుందర ఉద్యాన వనాన్ని తలపించేలా ఉంది.రాజధానికి దారి తీసే అన్ని ముఖద్వారాలనూ అత్యంత ఆకర్షణీయంగా రూపొందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. స్పందించిన ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారథి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి జంక్షనను ముందుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఏడీసీ రూపొందించిన రెండు డిజైన్లూ వారధి జంక్షన వద్ద ఉన్న ట్రాఫిక్ ఐల్యాండ్లను హరిత శోభితంగా మార్చేవే. ఒకటి గతంలో బౌద్ధానికి సూచికగా భారీ ధర్మచక్రం, ఇతర ఆకర్షణలతో కూడి ఉంది. ఈ నమూనాలో వలయాకారంలో ఉన్న స్థూపంపై పురాతన శిల్పకళను ప్రతిబింబించే మందిరాల మధ్య ధర్మచక్రాన్ని ఏర్పాటు చేస్తారు. స్థూపం చుట్టూ ఆకట్టుకునే పలు రకాల క్రోటన్లు, పూలమొక్కలతోపాటు అక్కడక్కడ పెద్ద చెట్లను సైతం పెంచుతారు. సందర్శకులు నడిచేందుకు వీలుగా వాకింగ్ టైల్స్‌తో కూడిన బాటలను ఏర్పాటు చేస్తారు. చక్కటి పచ్చిక బయళ్లూ, వాటి మధ్యన చెట్ల వరుసలూ మాత్రమే ఉంటాయి. ఈ లాన్లను కూడా ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా వివిధ వర్ణాల్లో ఉండే క్రోటన్లు, ఇతర మొక్కలతో రంగురంగుల్లో ఉండేలా చూస్తారు. ట్రాఫిక్ ఐల్యాండ్ల స్వరూపానికి అనుగుణంగా పచ్చిక బయళ్లను చక్కటి ఆకృతుల్లో అభివృద్ధి పరుస్తారు. ఇప్పటికే దీనికి సంబందించిన పనులు పరుగులు పెడుతున్నాయి.