ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ప్రతిపాదించిన ఏడు గ్రిడ్‌లో ఒక దాదాపు పూర్తిగా నెరవేరనుంది. అన్ని రంగాల సమంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తయారుచేసిన ఈ ప్రణాళికలో ఫైబర్ గ్రిడ్ ఒకటి. ఇంటర్నెట్‌ను అందరికీ చేరువ చేయాలన్నది దీని లక్ష్యం. జియోతో ఇప్పటికే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినా దానికి ఖర్చు పెట్టాల్సి వస్తోంది.ఏపీ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసింది. అందరికీ ఇంటర్నెట్… అది కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఒక అత్యవసర సాధనం ఇపుడు. టెక్నాలజీని ఇంటి పేరుగా మార్చుకున్న చంద్రబాబు ఫిబ్రవరి నుంచి ఏపీలోని అన్ని పురపాలక పట్టణాల్లో ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందిస్తున్నారు. అన్ని మున్సిపాల్టీల్లో ఉచితంగా వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫిబ్రవరి 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 110 మున్సిపాలిటీల్లో గుర్తించిన 970 ప్రాంతాల్లో వైఫై సేవల్ని ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. దీనికి గాను గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఈ సేవలు అందిస్తారు. ఈ ఉచితం ఎంతవరకు, ఇంకా ఇతర నిబంధనలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. విధి విధానాలు రూపొందుతున్నాయి. దీనివల్ల వచ్చే ఇతర భద్రతాపరమైన ఇబ్బందులకు ఎలా చెక్ పెట్టాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు.