YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వరుస ఎన్నికలు.. పార్టీలకు తలనొప్పులు

వరుస ఎన్నికలు.. పార్టీలకు తలనొప్పులు
2019 ఎన్నికల నామ సంవత్సరం, ఈ ఏడాదంతా ఎన్నికలే….ఎన్నికలు. అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం అక్టోబరులోగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు ఆఖరుకు ఝార్ఖండ్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా,ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో నిన్న మొన్నటి దాకా పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చక్రం తిప్పింది. ఈ నేపథ్యంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేవ:, బిజూ జనతాదళ్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ల వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ లకు జీవన్మరణ సమస్య వంటిది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒక్కదాంట్లో కూడా కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం గమనార్హం.మూడు దశాబ్దాల తర్వాత 2014లో బీజేపీ సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. మిత్రులతో కలసి మంచి మెజారిటీ సాధించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో రాజీవ్ గాంధీ నాలుగువందలకు పైగా స్థానాలను సాధించారు. ఆ తర్వాత అన్ని సంకీర్న ప్రభుత్వాలే. మళ్లీ 2014లో మోదీ గాలి వీయడంతో కమలం సొంతంగా మెజారిటీ సాధించింది. ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా? అన్నది అనుమానమే. కమలం శ్రేణుల్లోనూ ఆ ధీమా కనపడటం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఆ పార్టీని మరింత కుంగదీసింది. ఇప్పుడిప్పుడే ఓటమి వేదన నుంచి బయటపడుతుంది. మోదీ ప్రభావం మసకబారడం, ఉత్తరాదిన వ్యతిరేకత, జీఎస్టీ, పెట్రో ధరల పెంపు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలు కమలానికి కష్టాలు కొనితెస్తాయన్న వాదన కనపడుతోంది.అదే సమయంలో ఎన్డీఏ సంకీర్ణంలోని మిత్రుల అలకలు, హెచ్చరికలు కమలాన్ని కలవరపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి నుంచి బయటకు వచ్చింది. శివసేన, అకాళీదళ్ వంటి పార్టీలు చిర్రుబుర్రులాడుతున్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్ శక్తి (ఆర్ఎల్పీ) దీ అదే పరిస్థితి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యు) మాత్రమే కూటమిలో ఒకింత సౌకర్యంగా ఉన్నట్లు కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల గోదావరిని ఈదడం అంత తేలికైన పని కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంతర్గతంగా పార్టీ కూడా అదే భావనలో ఉంది. అయితే అగ్ర కులాల రిజర్వేషన్లతో మళ్లీ పార్టీకి, మోదీకి ఊపు వచ్చేలా కనపడుతోంది.ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అతి ముఖ్యమైనది. నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి పరిస్థితి అంత సానుకూలంగా లేదన్న వాదన వినపడుతోంది. బీజేపీతో పొత్తు, సినీనటుడు పవన్ కల్యాణ్ మద్దతుతో 2014లో సైకిల్ పార్టీ చక్రం తిప్పగలిగింది. అయినప్పటికీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి మధ్య ఓట్ల తేడా పరిమితమే కావడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీ, పవన్ కల్యాణ్ దూరం జరగడం, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికార పార్టీకి గడ్డుపరిస్థితి తప్పక పోవచ్చు. అదే సమయంలో విపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడాదికి పైగా పాదయాత్ర చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేటితో ముగించారు. ఆయనకు గల ప్రజాదరణను తక్కువగా అంచనా వేయలేం. ఈనేపథ్యంలో చంద్రబాబుకు ఈ ఎన్నికలు చుక్కలు చూపిస్తాయన్నది విమర్శకుల అభిమతం.లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో పెద్ద రాష్ట్రం ఒడిశా. 2014లో బిజూ జనతా దళ్ మొత్తం 147 స్థానాలకు గాను 117 స్థానాలను సాధించి తిరుగులేని ఆధిక్యంతో ఉంది. కాంగ్రెస్ 16, బీజేపీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. బిజూ జనతాదళ్ కే అవకాశాలున్నప్పటికీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం అసెంబ్లీకి లోక్ సభతో పాటే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఇరవై అయిదేళ్లుగా పాలిస్తోంది. గత ఎన్నికలలో ఎస్.డి.ఎఫ‌ 22,విపక్ష సిక్కిం క్రాంతి కార్ మోర్చా 10 స్థానాలు సాధించాయి. ఈసారి కూడా ఎస్.డి.ఎఫ్ కే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. రద్దయిన కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే జరగనున్నాయి. గత ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖరులో ఝార్ఖండ్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 81 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 37, జేఎంఎం 19, కాంగ్రెస్ 7 స్థానాలు కలిగి ఉన్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఉన్నట్లు కనపడదు. 2019లో ఎన్నికలు జరగనున్న అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. 288 స్థానాలున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో 121 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 63 స్థానాలు గల శివసేన మద్దతుతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు సాధించాయి. గత ఐదేళ్లుగా బీజేపీ శివసేన సంకీర్ణ సర్కార్ కలహాల కాపురంగా ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎంత మేరకు పార్టీని గట్టెక్కిస్తారన్నది అనుమానమే. 90 స్థానాలు గల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో బీజేపీ 47 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 15, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ తనయుడు ఓంప్రకాశ్ చౌతాలా నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్19 స్థానాలు సాధించాయి. బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి పార్టీని గట్టెంకించగలరా? అన్నది అనుమానమే

Related Posts