ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విపక్ష నేతలుగా వున్న వారు సుదీర్ఘ పాదయాత్రలు చూసినవారంతా ముఖ్యమంత్రులు అయిన సెంటిమెంట్ వైఎస్ నుంచి మొదలైంది. వైఎస్ మహా ప్రస్థానం తరువాత టిడిపి ప్రభుత్వాన్ని గద్దెదింపారు. ఆ తరువాత వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు పాదయాత్ర తరువాత అధికారంలోకి వచ్చారు. అయితే ఒక్కో పాదయాత్ర ఒక్కోరీతిన సాగిందనే చెప్పాలి. ఇక వైసిపి అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రకు అనేక ప్రత్యేకతలు వున్నాయి. గతంలో వైఎస్ 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిలో అధికారం కోల్పోయారు. ఆ తరువాత పాదయాత్ర చేపట్టి అఖండ విజయం సాధించారు. జగన్ కూడా గత ఎన్నికల్లో అతి తక్కువ తేడాల్లోనే అధికారం కోల్పోయారు. తన తండ్రి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకుని పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యి పార్టీ ని అధికారంలోకి తేవాలని అహరహం శ్రమించారు వైసిపి చీఫ్.14 నెలలపాటు ప్రజల్లో ఉండటం అంటే మాటలు కాదు. కుటుంబాన్ని వదులుకుని సుఖాన్ని వదులుకుని, పగలు రాత్రి తేడా లేకుండా ఎండకు వానకు తిరుగుతూ వేలకిలోమీటర్లు తిరగడం చరిత్ర సృష్ట్టించడమే. కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి దానికి ప్రతిఫలంగా కేసుల్లో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో వుండి ఆ తరువాత పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అలుపెరగని పోరాటం సాగించడం జగన్ కె చెల్లింది. అధికారం అందినట్లే అంది ప్రతిపక్షానికి పరిమితమైన వైసిపి కి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే వున్నాయి.23 మంది వైసిపి ఎమ్యెల్యేలు టిడిపి లోకి అభివృద్ధి అభివృద్ధి అంటూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం అధికారపార్టీ పంచన చేరడం పార్టీని ఇక్కట్ల పాలు చేసింది. ఇలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటు జగన్ జనం జపమే చేస్తూ వచ్చారు. వారితోనే ఉండేందుకే నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వైసిపి కి ఆక్సిజన్ అయ్యింది. వచ్చే ఎన్నికల ముందు జగన్ పాదయాత్రే వైసిపికి బలంగా మారింది. మరి వైఎస్ నుంచి ప్రతిపక్ష నేతలకు దక్కుతున్న ఫలం ఇప్పుడు వైసిపికి దక్కుతుందో లేదో తేలాలి అంటే మరికొద్ది నెలలు వేచి చూడాలి