అసద్ వైసీపీ అండగా ఉండనున్నారా? ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ప్రారంభించనున్నారా? అవును. అసద్ సిద్ధమే. జగన్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబునాయుడిపై ఎంఐఎం అధినతే అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలంలో అసదుద్దీన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి వస్తారా? రారా? అన్న చర్చజోరుగానే సాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పటికే ముగిసింది. ఆయన ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణాకే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఏపీలోనూ తన జోరును పెంచాలనుకుంటోంది. అయితే అక్కడ పోటీ చేయకుండా వైఎస్ జగన్ కు మద్దతివ్వాలని దాదాపు అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబునాయుడు ఓటమి లక్ష్యంగా ఆయన వివిధ సభల్లో ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో అసదుద్దీన్ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట దాదాపు పది చోట్ల ఒవైసీ సభలు ఉంటాయని చెబుతున్నారు.ఎన్నికలకు ముందు ఈ సభలను ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ తరుపున ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ సిద్ధమయినప్పటికీ జగన్ సమ్మతి అవసరం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒవైసీ బ్రదర్స్ ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ జగన్ తోనూ అసదుద్దీన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒవైసీ బ్రదర్స్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులు జగన్ కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నారు.వైసీపీ నేతలు అసదుద్దీన్ ఒవైసీతో ఒక దఫా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముస్లింలు అధికంగా ఉన్న కడప,కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అసద్ పర్యటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు రూట్ మ్యాప్ ను కూడా అసద్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఎంఐఎం కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. జగన్ పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడాకే పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. కొంతకాలం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒవైసీ జేడీఎస్ కుమద్దతు ప్రకటించారు. అక్కడ పర్యటించారు కూడా. ఇదే తరహా ప్రచారాన్ని చేయాలని అసద్ నిర్ణయించుకున్నారు. అసద్ అండగా నిలవడంతో ముస్లింలు తమవైపు ఖచ్చితంగా మరలుతారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.