YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అఖిలప్రియకు సొంత పార్టీలోనే శత్రువులు

అఖిలప్రియకు సొంత పార్టీలోనే శత్రువులు
మంత్రి భూమా అఖిలప్రియ వ్యూహాత్మకంగానే వెళుతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు తనవైపే ఉండాలని, క్యాడర్ ఎటూ వెళ్లకుండా తనను అంటిపెట్టుకునే ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియకు సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అఖిలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇటీవలే టీడీపీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ పరిణామాలన్నీ అఖిలప్రియను నిద్రపోనివ్వడం లేదు.తొలుత సొంత పార్టీని చక్క దిద్దుకోవాలని అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అంది వచ్చిన అవకాశాన్ని అఖిలప్రియ చక్కగా వినియోగించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతుండటం విశేషం. తన అనుచరుల ఇళ్లల్లో కార్టన్ సెర్చ్ చేశారంటూ అఖిలప్రియ ఐదు రోజుల క్రితం తన గన్ మెన్లను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. ఎస్కార్ట్ లేకుండానే మంత్రిగా అఖిలప్రియ జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే దీనిపై పార్టీ అగ్రనేతలెవరూ ఇంతవరకూ స్పందించలేదు. అఖిలప్రియ చేసింది తప్పు అని పార్టీ హైకమాండ్ కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. సాధారణ తనిఖీల్లో భాగంగానే అన్ని పార్టీల నేతల ఇళ్లల్లో కార్టన్ సెర్చ్ చేశామని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. ఇందులో వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నా అఖిలప్రియ మాత్రం తాను పట్టిన పట్టు వీడటం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తన అనుచరుల ఇళ్లలో సోదాలు చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కావాలంటే తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించుకోవచ్చన్నది ఆమె వాదన. తనకు గన్ మెన్లు అవసరం లేదని, ప్రజలు, కార్యకర్తలే తనకు రక్షణ కల్పిస్తారని ఆమె వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.ఆళ్లగడ్డలో తన నాయకత్వానికి ఏమాత్రం ఢోకాలేకుండా చూసుకోవడం ఒకవైపు, అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలను తమవైపు తిప్పుకోవడానికి మాత్రమే అఖిలప్రియ ఈ స్ట్రాటజీని అనుసరిస్తున్నారని చెబుతున్నారు. అందుకోసమే పార్టీ కూడా అఖిలప్రియ చేసిన పనిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. లేకుంటే ఈ పాటికి జిల్లా ఎస్పీని వివరణ కోరి ఉండేవారని, అఖిలప్రియ తన గ్రాఫ్ పెంచుకోవడం కోసమే గన్ మెన్లను వెనక్కు పంపారంటున్నారు ఆ పార్టీలోని అఖిల వ్యతిరేక వర్గం. మొత్తం మీద ముందు క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకునేందుకు, తనపై నమ్మకాన్ని పెంచుకునేందుకే అఖిల ఈ ప్రయత్నం చేసి ఉంటారన్న అనుమానాలను ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండటం విశేషం.

Related Posts