YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పౌరసత్వ సవరణ బిల్లుతో ఎన్డీయే కు మరో పార్టీ గుడ్ బై

 పౌరసత్వ సవరణ బిల్లుతో ఎన్డీయే కు మరో పార్టీ గుడ్ బై
పౌరసత్వ సవరణ బిల్లు దేశంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అస్సాంలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయేకు చెందిన పలు పార్టీలు కూడా బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లు కారణంగా మరో పార్టీ కూడా ఎన్డీయే కూటమి నుంచి వైదొలడానికి సిద్ధమైంది. బీజేపీ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ.. మేఘాలయకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) కూడా ఎన్డీయేకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లు-2018కు లోక్‌ సభలో ఆమోదం తెలపడంతో అసోం గణ పరిషత్‌ (ఏజీపీ) ఇప్పటికే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ఎన్‌పీపీ కూడా కమలం పార్టీకి కటీఫ్ చెప్పడానికి సిద్ధమైంది. దీంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయే కూటమికి చిక్కులు తప్పేట్లు లేవు. ఈ బిల్లును మేఘాలయ సీఎం కన్రాద్‌ సంగ్మా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకోవాలనే దిశగా పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. పార్టీ నేతలతో చర్చలు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఎన్‌పీపీ 5 ఈశాన్య రాష్ట్రాల్లో ఉందని తెలిపారు. తీవ్ర నిరసనల మధ్య కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2018కు లోక్‌ సభ మంగళవారం (జనవరి 8) ఆమోదం తెలిపింది. తద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ముస్లింలు కాకుండా 6 ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వాదిస్తోంది. దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది

Related Posts