పవన్ రాజకీయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ఆయన అభిమానుల పరిస్థితి మరీ దారుణం. పూర్తి యంత్రాంగం ఉన్న పార్టీలే తలమునకలు అవుతుంటే… పార్టీ నిర్మాణమే లేకుండా పవన్ కళ్యాణ్ జనసేనతో భారీ రిస్కు చేస్తున్నారు. అసలే ఆ కుటుంబం నుంచి భారీ రాజకీయ వైఫల్యం ఉన్న నేపథ్యంలో కుల పరంగా ఆలోచనా పరులు ముందుకు రావడానికే భయపడుతున్నారు. కానీ పవన్ దానిని మరింత కాంప్లికేట్ చేస్తున్నారు. తన మాట మీద తనే నిలబడకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… ఆయనను ఎవరూ నేరుగా ప్రశ్నించరు గాని ఆయన కేడర్‌ను అందరూ ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో ఇప్పటికి జనసేనకి జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా, పార్లమెంటరీ స్థానం వారిగా ఇలా నిర్మాణమే లేదు. కో ఆర్డినేటర్ల వ్యవస్థ లేదు. పార్టీని గ్రామాల్లో, మండలాల్లో బాధ్యతగా తీసుకునే వ్యవస్థ లేదు. కానీ 175 స్థానాల్లో పోటీ చేస్తాం అంటున్నాడు పవన్. అసలు పార్టీకి ఏదైనా చెప్పాలంటే… స్వయంప్రకటిత నేతలు తప్ప పార్టీ ప్రకటిత నేతలే కానరాకపాయె. దీంతో జనసేన కేడర్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇదే పెద్ద తలనొప్పి అవుతుంటే అధినేత పవన్ నిర్ణయాలు వారిని మరింత పిచ్చెక్కిస్తున్నాయి.ఏపీలో ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధంగా ఉండే వాతావరణం ఉన్నా పవన్ దానిని వాడుకోవట్లేదు. జగన్ – బాబుల తర్వాతే తన లిస్టు ఇస్తా అంటున్నారు. మొన్నే కేవలం 60 మందికే కొత్త వారికి టిక్కెట్లు ఇస్తానని పవన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈరోజు చేసినవ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంటే … ఆ రెండు పార్టీలు టిక్కెట్లు ప్రకటించిన తర్వాత టిక్కెట్స్ రాని రెబల్స్ చేరదీయడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అన్న అనుమానం వస్తోంది ఇపుడు. అంటే జగన్‌వి రెబల్ పాలిటిక్స్ అన్నమాట.