గురువారం విజయవాడ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో కడప జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ శ్రేణులకి పార్టీ అధినేత పవన్కళ్యాణ్ దిశానిర్దేశం చేసారు. పవన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన కోసం ఒక పక్క విపరీతమైన పోరాటం జరుగుతుంటే, ఆ పోరాటం తాలూకు ఒత్తిడిని తట్టుకునే నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా లేకుండా పోయారు. ఇందిరాగాంధీ లాంటి రాజకీయ సంకల్పం బలంగా ఉన్న నేతలు ఎలాంటి ఒత్తిడిని అయినా అవలీలగా తట్టుకునే వారు. ఆవిడపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించేందుకు అంగీకరించలేదు. అటువంటి నేతలు మనకు ఇప్పుడు కనుమరుగైపోయారని అన్నారు. 90వ దశకం చివరిలోనే తెలంగాణ బావజాలం బలపడడాన్ని నేను గమనించాను. ముఖ్యంగా యువతలో ఈ కోరిక బలపడడాన్ని గ్రహించాను. ఇది మార్పుకి సంకేతంగా నేను భావించాను. తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలు సాంస్కృతికంగా సమ్మిళితం కాలేకపోయాయి. ఇది కూడా వేర్పాటు బీజాల అంకురార్పణకి కారణమని అన్నారు. రాయలసీమలో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది దీనిపై మనం ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయి. ఈ మార్పు కోసమే నేను 2014లో జనసేన పార్టీని ప్రారంభించాను. దీనికి తోడు తృతియ పక్షం లేని పక్షంలో ఉన్న రెండు రాజకీయ పక్షాలు తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉన్నందున మధ్యే మార్గంగా జనసేన ఆవిర్భావం జరిగిందని వెల్లడించారు. ప్రజారాజ్యం పెట్టక ముందు నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాను. ఆ సమయంలో నాతోపాటు ఎవరైతే ఉన్నారో వారే జనసేన ఆవిర్భావ సమయంలో నాతోపాటు ఉన్నారు. 2003లోనే నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచే ప్రపంచ, దేశ, రాష్ట్ర సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ వచ్చాను. నా రాజకీయ ఆలోచనలకి అనుగుణంగానే నా సినిమాలకి కూడా రూపకల్పన చేశాను. దృఢమైన భావజాలంతోనే జనసేనకు రూపకల్పన చేశాను. నేను వ్యవస్థని బలపర్చడానికి వచ్చానే తప్ప వ్యక్తిగా బలపడడానికి రాలేదు. పోరాటం చేసే వారికే గెలుపు సిద్ధిస్తుంది. గెలుపు కోసమే పని చేసే వారితో గెలుపు దోబూచులాడుతుందని అన్నారు. నాకు ముఖ్యమంత్రిగా పని చేయాలని ఉందంటూ ఓ పక్కన జగన్ అంటుంటే, మళ్లీ ముఖ్యమంత్రిని చేయమని నారా చంద్రబాబు నాయడుగారు అంటున్నారు. అధికారం కోసం ఆలోచించే వారికి ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉండదు. ఇది మనకి చరిత్ర చెబుతున్న పాఠం. పోలిటిక్స్ నాకు వ్యాపారం కాదు. రాజకీయాల్లో నేను డబ్బు సంపాదించనక్కర్లేదు. స్టార్ డమ్ ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేశానని అన్నారు. 2003 నుంచి డబ్బు ప్రభావిత రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఆ సమయంలోనే ఇటువంటి వ్యవస్థని మార్చడానికి ఒక నాయకుడు అవసరం అని భావిస్తున్న తరుణంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. అయితే లక్ష్య ఛేదనలో ఆయన పక్కన ఉన్నవారే ఆయన్ని నిరాశకు గురిచేశారు. అటువంటి స్థితి తర్వాత నేను జనసేనను స్థాపించి కోట్లాది మంది జనం అభిమానం పొందుతున్నానంటే నేనెంత మొండివాణ్ణో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొత్తగా పార్టీని స్థాపించినందు వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.. అవన్నీ నాకు అవగతమే. ఇలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే ధైర్యం, సత్తా జనసేన శ్రేణులకి ఉన్నాయని అయన అన్నారు.