వైకాపా అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ముగించుకుని శుక్రవారం పులివెందులకు చేరుకుంటారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడే బస చేసి.. శుక్రవారం ఉదయం తిరుమల నుంచి పులి వెందులకు బయలుదేరుతారన్నారు. కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పులివెందులకు చేరుకుని స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారన్నారు. తర్వాత ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పిస్తారన్నారు. 12, 13 తేదీల్లో భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.