Highlights
- చేవేళ్ళ నుంచి ప్రారంభం
- మార్చి 11 వరకు మొదటి విడత ః హోలీ పండుగ కోసం మూడు రోజుల విరాం
- ఏ్రపిల్ 1 నుంచి మే 15 వరకు రెండో విడత బస్సు యాత్ర
- మే 15 నుంచి వివిధ ప్రాంతాల నుంచి నేతల పాదయాత్రలు, రథయాత్రలు
- జూన్ 1న భారీ బహిరంగ సభ, రాహుల్ రాక
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బస్సు యాత్ర ఈ నెల 26వ తేదీ నుంచి మొదటి విడత యాత్రను ప్రారంభించనున్నట్టు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సి.ఎల్.పి జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, పిఎసీ చైర్మన్ గీతారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పిసిసి ఉపాధ్యక్షలు, డిసిసి అద్యక్షులు పాల్గొన్నారు.
సమావేశంలో బస్సు యాత్రతోపాటు వివిధ రాజకీయ అంశాలను చర్చించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ ఈ నెల 26న రంగారెడ్డి చేవేళ్ళలో బస్సు యాత్రను ప్రారంభిస్తామని 1 గంటకు యాత్ర ప్రారంభమవుతుందని అక్కడ పూర్తి కాగానే అదే రోజు 4 గంటలకు వికారాబాద్‌లో, 27న తాండూరులో 1 గంటకు, 27న 4 గంటలకు సంగారెడ్డిలో 28న 1 గంటకు జహీరాబాద్‌లో 28న 4 గంటలకు నారాయణ ఖేడ్‌లో ఈ బస్సు యాత్ర సభలు జరుగుతాయని ఆయన వివరించారు.
కాగా మార్చి 1 నుంచి 3 వ తేదీ వరకు హోళీ పండుగ కారణంగా బస్సు యాత్ర ఉండదని తిరిగి 4 వ తేదీ నుంచి 11 వ తేదీ నుంచి యాత్ర కొనసాగుతుందని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల తరువాత తిరిగి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో బస్సు యాత్ర నిర్వహిస్తామని వివరించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, ఎం.ఎల్.ఎ రేవంత్ రెడ్డి, మాజీ ఎం.పి పొన్నం ప్రభాకర్‌లు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రలు నిర్వహిస్తారని, అలాగే సీనియర్ నాయకులు ఎఐసిసి కార్యదర్శి వి.హనుమంతరావు రాష్ట్రంలో రథ యాత్ర చేపడుతారని ఆయన వివరించారు. కాగా ఈ యాత్రలు అన్ని జూన్ ఒకటి నాటికి ముగించుకొని జూన్ 1వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ వరంగల్‌లో కానీ, హైదరాబాద్‌లో కానీ నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కాగా ఈ సభకు ముఖ్య అతిధిగా ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాందీ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రతో జూన్ 1వ తేదీ జరిగే బహిరంగ సభతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన వివరించారు.