విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు రెండు రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మంగళవారం లోక్‌సభ సభ్యులు దీనికి ఆమోద ముద్ర వేయగా.. బుధవారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కొందరు అభిప్రాయపడినా.. చివరకు ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి అందరూ అనుకూలంగా ఓటువేశారు.ఇక రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. అయితే ఈ బిల్లును సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్విటీ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్లు వల్ల దేశంలో రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి సామాజిక వర్గాల ప్రజలు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5శాతం రిజర్వేషన్లకు ఇది అదనం. దీంతో దేశంలో రిజర్వేషన్లు 59.5శాతం అవుతాయి. అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ప్రస్తుత బిల్లు ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఉండటంతో దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.