భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిరోజే ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్‌లో లీక్ చేశారు లీక్ రాయుళ్లు. గత కొన్నేళ్లుగా తెలుగు, తమిళ చిత్రాలతో బాలీవుడ్ చిత్రాలను రిలీజ్ రోజునే విడుదల చేస్తూ ఇండస్ట్రీని గజగజలాడిస్తున్న పైరసీ భూతం తమిళ రాకర్స్ వెబ్ సైట్ వాళ్లు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని నెట్‌లో హెచ్ డీ రిజల్యూషన్‌తో లీక్ చేసింది.
గతంలో ఇదే వెబ్‌సైట్ 2.0, మహానటి, సర్కార్, అరవింద సమేత, భరత్ అనే నేను తదితర చిత్రాలను సైతం లీక్ చేశారు. పోలీసులు వీరిపై రైడ్స్ జరిపి నిర్వాహకులను జైలుకు పంపినప్పటికీ తమ చేతివాటాన్ని వదలడం లేదు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంది. తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ.. రెండో రోజు రజినీకాంత్ పేట చిత్రంతో పాటు.. వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు 11, 12 తేదీలతో విడుదల కానుండటంతో కలెక్షన్లు కష్టంగా మారింది. ఈ తరుణంలో సినిమా మొత్తం నెట్‌లో ప్రత్యక్షం కావడంతో షాక్‌లో ఉంది ‘కథానాయకుడు’ చిత్ర యూనిట్. వెంటనే నివారణ చర్యలు చేపట్టి.. నెట్‌లో లీకైన లింక్‌లను తొలగించే పనిలో పడ్డారు కథానాయకుడు టీం