YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోమిరెడ్డి వర్సెస్ రోజా

సోమిరెడ్డి వర్సెస్ రోజా
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈసభపై ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని రోజా అన్నారు. కానీ, అక్కడ జనమే లేరని టీడీపీ నేత సోమిరెడ్డి అంటున్నారని, ఆయన గనుక నిన్నటి సభకు వచ్చి ఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప పాదయాత్ర సాగిందని అన్నారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్‌ జగన్‌ నేడు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని తెలిపారు.చంద్రబాబు వంచన, ప్రజావ్యతిరేక పాలన పట్ల ప్రజలకున్న కోపాన్ని శాంతిపరుస్తూ, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాగిందని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి గారిని జగన్‌లో చూసుకున్నారని, గత ఎన్నికల్లో చేసిన తప్పు ఈసారి చేయకూడదని ప్రజలు భావిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. రాజన్న పరిపాలన కావాలని, జగన్‌ను సీఎంగా చూడాలనే నినాదానాలతో ఇచ్చాపురం సభలో మార్మోగిపోయాయని అన్నారు. ప్రజాబలం ఏంటో సోమిరెడ్డి లాంటి వారికి అర్ధం కాదని, ఐదుసార్లు ఓడిపోయిన వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పాసైనవారికి ఎవరైనా మంత్రి పదవి ఇస్తారు గానీ, ఓడిపోయిన వ్యక్తిని అందలం ఎక్కించారని అన్నారు. సిగ్గులేకుండా వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. 

Related Posts