దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచింది. మోడల్ ప్రాతిపదికన వాహన ధరల పెంపు రూ.10,000 వరకు ఉంటుందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కమోడిటీ ధరల పెంపు, విదేశీ మారక విలువ పెరుగుదల వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో పలు కార్లపై ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ధరల పెంపు నిర్ణయం జనవరి 10 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. కాగా కార్ల ధరలను పెంచాలని కంపెనీ గత నెలలోనే నిర్ణయించుకుంది. అయితే కంపెనీ ఏ మోడళ్లపై ధరలు పెంచింది తెలియజేయలేదు. గతంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి 4 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూపాయి క్షీణత కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ.. ఎంట్రీ లెవెల్ కారు ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకు పలు మోడళ్లను దేశీ మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.2.53 లక్షలు- రూ.11.45 లక్షల శ్రేణిలో ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కంపెనీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు డిసెంబర్‌లో తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరలు పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.