సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే బీజేపీకి గుడ్‌బై చెప్పి, జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించగా, పార్టీని వీడే ఆలోచనలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఒక ఆ ఎమ్మెల్యే తన అనుచర వర్గంతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన తన నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నాయకులతో పార్టీ మారే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తనకు ఏ పార్టీ టిక్కెట్టు వచ్చినా మద్దతివ్వాలని నియోజకవర్గంలోని కొందరు పెద్దల నుండి హామీ తీసుకున్నట్లు సమాచారం. అలాగే టీడీపీ నేతలతో సాన్నిహిత్యం ఉన్న మరో ఎమ్మెల్యే సైతం పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఒక ఎంపీ తనయుడు వైసీపీ అధినేత జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్‌కు సన్నిహితుడైన ఆ ఎంపీ తనయుడు వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక విశాఖలో పార్టీకి కీలకమైన నేతలు పృధ్వీరాజ్, చెరుకు రామకోటయ్య కూడా పార్టీకి రాజీనామా చేయడం కూడా బీజేపీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చు. అయితే వీరంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారు కావడంతో ఎన్నికల ముందు ఇటువంటి చిన్నపాటి స్టంట్లు సహజంగానే ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ల పరధిలోని బూత్ కార్యకర్తలతో మాట్లాడటం, అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం వంటి సంస్కరణలతో పార్టీకి జోష్ ఇస్తున్నారని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఈ నెలలో అమిత్ షా పర్యటనను ఖరారు చేసుకున్న తరుణంలో ఈ రాజీనామాల పరిణామాలు పార్టీ నేతలను కాస్త ఇబ్బందులకు గురి చేసినట్లేనని చెప్పవచ్చు.