YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ పునరావాస కాలనీలో ఉండేదెలా...

ఈ పునరావాస కాలనీలో ఉండేదెలా...
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న తమకు కల్పిస్తున్నది పునరావాసమా లేక వనవాసామా అనేది అర్థం కావడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టుకు ఎడమవైపు తూర్పు గోదావరి జిల్లా పి.గొందూరు గ్రామవాసుల ఆవేదన ఇది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎడమ గట్టు వైపు  రెండో విడత ఖాళీ చేయాల్సిన పనె్నండు గ్రామాల్లో పి గొందూరు గ్రామంవుంది. సుమారు పదేళ్ల క్రితం ఖాళీచేయవలసిన గ్రామంగా గుర్తించిన పి.గొందూరులో సుమారు 148 కుటుంబాల వరకు నిర్వాసితులవుతారని అధికారుల సామాజిక సర్వేలో తేలింది. వీరందరికీ దేవీపట్నం మండలం నేలకోట వద్ద పునరావాస కాలనీ నిర్మించారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. తాగడానికి ఉపయోగపడని నీరు కాకపోయినా బోరు కూడా వేశారు. అయితే కొత్త పునరావాస చట్టం ప్రకారం తమకు రావాల్సిన మొత్తం పునరావాస ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే గ్రామాన్ని విడిచిపెడతామని, అంతవరకు పునరావాస కాలనీకి వెళ్ళేది లేదని గ్రామస్థులు భీష్మించారు.ఈ గ్రామంలో నిర్వాసితులయ్యే వారికి దేవీపట్నం మండలం నేలకోట వద్ద కాలనీ నిర్మించారు. అయితే తమకు నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం లభించే వరకూ గ్రామాన్ని ఖాళీచేసేది లేదని పి.గొందూరు వాసులు భీష్మించడంతో, వారి కోసం నిర్మించిన పునరావాస కాలనీ శిథిలావస్థకు చేరింది. అలాగే తమ జీవనోపాధిని దూరంచేసేలా ఎక్కడో దూరంగా నిర్మించిన కాలనీలోకి చేరేది లేదని గ్రామస్థులు స్పష్టంచేస్తున్నారు.18 ఏళ్ళు నిండిన వారికి కూడా పునరావాస ప్యాకేజి ఇవ్వాలని, చట్టం ప్రకారం వారికి కూడా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని గత పదేళ్లుగా నిర్వాసితులు అధికారులకు చెబుతూనే ఉన్నారు. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే తమ గ్రామానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నేలకోట వద్ద నిర్మించిన పునరావాస కాలనీలో నివాసం ఉంటే తమకు ఎటువంటి కూలీ పనులు కూడా దొరకవని నిర్వాసితులు వాపోతున్నారు. తమ గ్రామాలకు దగ్గరలోనే పునరావాసం కల్పిస్తేనే వెళతామని చెబుతున్నారు. దీనికితోడు భూమికి భూమి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, వ్యవసాయానికి యోగ్యమైన భూమి కేటాయింలేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం తమ గ్రామాన్ని ఖాళీచేసిన జాబితాలో కలిపేసి, కనీస వౌలిక సదుపాయాలు కూడా రద్దుచేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.ఇక ఈ గ్రామస్థుల కోసం నేలకోట వద్ద నిర్మించిన పునరావాస కాలనీలోని ఇళ్లు ఇంకా ప్రాంభించకుండానే శిథిలావస్థకు చేరాయి. ఇపుడు బలవంతంగా ఆ ఇళ్ళల్లోకి వెళ్ళాలన్నా నివాసం వుండలేని పరిస్థితి నెలకొంది. తలుపులు లేకుండా, శ్లాబులు శిథిలమై, డాబా మెట్ల కూలిపోయి, ఇళ్లల్లో పిచ్చి మొక్కలు మొలిచి ఆ ప్రాంతమంతా అడవిలా మారిపోయింది. ఈ కాలనీకి వెళ్లడానికి నిర్వాసితులు విముఖత వ్యక్తం చేయడానికి మరో ప్రధానమైన కారణం కాలనీని చేరుకోవడానికి ప్రధానమైన రహదారి లేదు. ఉన్న ఒక రోడ్డు నుంచి కనీసం 15 కిలోమీటర్లు తిరిగివెళ్తే తప్ప దైనందిన జీవితం గడవని పరిస్థితి. ఏ అవసరానికైనా అటు సీతానగరం గానీ, ఇటు గోకవరం గానీ పరిగెట్టాల్సిందే.ఆసుపత్రికి వెళ్లాలన్నా కాలి నడకే శరణ్యం. ఇలాంటి పరిస్థితుల్లో నేలకోట పునరావాస కాలనీలో నిర్వాసితులు ఎలా జీవిస్తారనేది ప్రశ్నార్థకమే. కాలనీ పేరిట ఖర్చుచేసిన కోట్లాది రూపాయలు అడవిపాలైనట్టయ్యింది.

Related Posts