వైకాపా అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ ను గురువారం ఆర్ధరాత్రి తెల్లవారుజామున విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. శుక్రవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టు ముందు శ్రీనివాస్ ను హాజరుపరిచారు. జగన్ దాడి చేసిన కేసు విశాఖ కోర్టు పరిధి నుంచి విజయవాడకు బదిలీ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే విజయవాడ మెట్రో పాలిటన్ సెషన్ జడ్జ్ కోర్టుకు కేసును బదిలీ చేశారు. జగన్పై దాడి కేసు పత్రాలను ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ ఏడో అదనపు మెట్రో పాటిటన్ మెజిస్ట్రేట్ కోర్టును అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు పంపించారు. దీంతో కోటి కత్తి దాడి కేసు ఇక విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో విచారణ జరుగనుంది.
ఈ పరిస్థితుల్లో నిందితుడు శ్రీనివాస్ విశాఖ కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తరలించారు. ఎన్ఐఏలోని అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుకు ఈనెల 1 నుంచి విశాఖలో ఉన్న బృందం న్యాయపరమైన చర్యలు పూర్తి చేసింది. నిందితుడు జె.శ్రీనివాస్ అడవివరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అడవివరం కేంద్ర కార్యాలయం నుంచి నిందితుడిని రాత్రి 12 గంటలకు విజయవాడ తరలించారు. గతేడాది అక్టోబర్ 25న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నారు.