Highlights
- రాగం: శ్రీరాగం
- స్వరకర్త ,గాత్ర సహకారం : ఎస్.వి.ఆనందభట్టర్
శుభోదయం...
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం
స్తుత్యుడీ తిరువేంకటాద్రి విభుడు॥
ఏమూర్తి లోకంబులెల్ల నేలెడు నాతఁ
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతఁ
డేమూర్తి నిజమోక్షమియ్యఁజాలెడు నాతఁ
డేమూర్తి లోకైక హితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును కాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైన ఆత
డేమూర్తి సర్వాత్ముడేమూర్తి పరమాత్ముఁ
డామూర్తి తిరువేంకటాద్రి విభుడు
యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవు దేహమున నిన్నియును నణగె మరి
యే దేవు విగ్రహం బీ సకల మింతయును
యేదేవు నేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నే దేవు చైతన్య మిన్నిటికి నాధార
మేదేవుడవ్యక్తు డేదేవుడద్వంద్వు
డా దేవుడీ వేంకటాద్రి విభుడు
యేవేల్పు పాదయుగ మిలయు నాకాశంబు
యేవేల్పు పాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీ మహా మారుతము
యేవేల్పు నిజదాసు లీ పుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశుఁ
డేవేల్పు భువనైక హిత మనోభావకుడు
యేవేల్పు కడు సూక్ష్మ మేవేల్పు కడు ఘనము
ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడు
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు ...తాళ్ళపాక అన్నమాచార్యులు
..