ఆస్ట్రేలియాతో ఆసక్తికరమైన మూడు వన్డే సిరీస్‌కి భారత్ సిద్ధమైంది. సిడ్నీ వేదికగా శనివారం ఉదయం 7.50 నుంచి తొలి వన్డే ప్రారంభంకానుండగా.. ఇటీవల నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. సీనియర్ క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడితో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుతో చేరిపోయి ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌కి ముందు భారత్ జట్టు కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో.. ఫామ్ అందుకోవాలని ధోనీ, ధావన్ ఆశిస్తున్నారు. సిడ్నీ వన్డేకి భారత్ తుది జట్టుపై డైలమా ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో వివాదాస్పద కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం కత్తి వేలాడుతుండటంతో తుది జట్టు ఎంపికపై టీమిండియాకి స్పష్టత రావడం లేదు. ఒకవేళ ఆ ఇద్దరినీ తప్పించాల్సి వస్తే..? దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌కి మార్గం సుగుమం కానుంది. ఆ ఇద్దరి నిషేధంపై బీసీసీఐ నిర్ణయం కోసం టీమ్ ఎదురుచూస్తున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. భారత్ వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్