విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథను `యన్.టి.ఆర్` బయోపిక్ రూపంలో తెరకెక్కించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఆధారంగా చేసుకుని తొలి భాగం `యన్.టి.ఆర్ కథానాయకుడు` రూపొందింది. ఈ చిత్రం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తండ్రికి తగ్గ తనయుడిగా, ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ నటన అద్వితీయం అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇటు ప్రేక్షకుల ఆదరాభిమానాలే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, నందమూరి హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌లు అద్భుతంగా ఒదిగిపోయారని ప్రశంసిస్తున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణతో `గౌతమిపుత్ర శాతకర్ణి` వంటి సెన్సేషనల్ మూవీని తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ బయోపిక్‌ను సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి సమర్పణలో ఎన్.బి.కె.ఫిలింస్, వారాహి చలన చిత్రం, విబ్రి పతాకాలపై నందమూరి వసుంధరా దేవి, నందమూరి బాలకృష్ణ ఈ బయోపిక్‌ను నిర్మించి.. తెలుగు జాతి గొప్పతనాన్ని, ఔనత్యాన్ని భావితరాలకు అందించే గొప్ప ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి ఉనికి ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ సినీ ప్రస్థానంతో రూపొందిన `యన్.టి.ఆర్ కథానాయకుడు` చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ -``నందమూరి బాలకృష్ణ రూపొందించిన యన్.టి.ఆర్ బయోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసినట్లు కాకుండా ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది. బాలకృష్ణ ఎన్టీఆర్ లా వందశాతం కనిపించారు. ఆయన వేసిన అన్నీ గెటప్స్‌లోనూ బావున్నారు. డెఫనెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను`` అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ - ``నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్‌గారితో కలిసి పాండు రంగ మహత్యం చేశాను. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించాను. బయోపిక్ చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూస్తున్నట్లుండేలా బాలకృష్ణగారు నటించారు. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం`` అన్నారు.
నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ - ``యన్.టి.ఆర్` బయోపిక్ అనౌన్స్ అయినప్పుడు ఇందులో ఓ అవకాశం వస్తుందా! అని ఆసక్తిగా ఎదురుచూశాను. మా అమ్మగారి తొలి సినిమా ఆయనతోనే నటించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా సమయంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ బయోపిక్‌లో వేషం వేయాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బరావుగారి వేషం. ఆ సన్నివేశాలను నేను చేస్తున్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. దర్శకుడు క్రిష్‌గారు ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు. ఆయన బయోపిక్‌ను తీయడం అంత సులభం కాదు. కానీ క్రిష్ ఓ ప్లానింగ్‌తో అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. తనకు హ్యాట్సాఫ్. అలాగే బాలయ్యగారిని అన్నదమ్ముల అనుబంధం సినిమా సమయంలో కలిశాను. తనతో మంచి అనుబంధం ఉంది. మేం మంచి మిత్రులం. ఈ సినిమాత బాలకృష్ణ మహానటుడిగా అవతరించారు తనకు హ్యాట్సాఫ్`` అన్నారు.