ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఓవైపు అధికారాన్ని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తుంటే.. ఈసారి కచ్చితంగా అధికారం చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంతంగా బరిలోకి దిగుతారా లేక, ఎవరికైనా మద్దతిస్తారా అనే దానిపై రాజకీయ సమీకరణాలు మందుకు సాగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలు జనసేనతో కలిసి బరిలో దిగనున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. విశాఖలోని సీపీఎం ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ జనసేన పార్టీ, వామపక్ష పార్టీల కూటమి ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు. ఓవైపు టీడీపీ ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోగా, మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచాయని గుర్తుచేవారు. ఈ నెల 18, 19, 20 తేదీలలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేస్తారన్నదానిపై చర్చిస్తామని తెలిపారు. కేంద్రంలో కూటముల వల్లగానీ, ఫెడరల్ ఫ్రంట్ వల్ల ప్రయోజనం ఉండదని మధు అభిప్రాయపడ్డారు