మండలి బుద్ధ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. అనూహ్యంగా వరించిన ఈ పదవి ఆయనకు తాత్కాలిక ఆనందాన్నే మిగుల్చుతోందని అంటున్నారు సన్నిహితులు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న మండలికి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుతాననే నమ్మకం సన్నగిల్లుతోందని, దాదాపు పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారని అంటున్నా రు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న మండలి.. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరిపోయారు. నిజానికి ఇది అనూహ్యమైన ఘటన. తన తండ్రి కాలం నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న మండలి.. వైఎస్ కాలంలో మంత్రిగా కూడా అవకాశం అందిపుచ్చుకున్నారు. అయితే, రాష్ట్ర విభజనతో ఏర్పడిన చిచ్చు నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకుని తన సొంత నియోజకవర్గం అవనిగడ్డ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక అవడం మరో అనూహ్య సంఘటన. అయితే, ఇదే ఇప్పుడు చేటు తెస్తోందని స్వయంగా మండలే బాధపడుతున్నారట! డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి- మా వూరు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఫలితంగా స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకునేందుకు ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో పార్టీ పరంగా కూడా క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు, నేతలకు దిశానిర్దేశం చేసేం దుకు పార్టీ జెండా మోసేందుకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఆయనను పార్టీ నేతలకు దూరం చేసింది కూడా! ఈ నేపథ్యంలో మండలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన మండలికి స్థానికంగా ఉన్న సమస్యలు తలనొప్పిగా మారాయి. దీనికితోడు ప్రజల నుంచి వస్తున్నఫిర్యాదుల వెల్లువ కూడా ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అడపా దడపా.. తనిఖీలు చేస్తున్నా.. ఫలితాన్ని ఇవ్వడం లేదు. పైగా అధికారులు అప్పటి వరకు ఊ… కొడుతున్నా.. తర్వాత మాత్రం మండలి ఆదేశాలను బుట్టదాఖలు చేస్తుండడంతో ఇక్కడి సమస్యలు ఎక్కడివక్కడే అనే చందంగా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోఅసలు పోటీకి దూరంగా ఉంటేనే బెటర్! అని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.