కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు నిలబడుతున్నారు? టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? అనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల విషయానికి వస్తే.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను చంద్రబాబు బీజేపీకి కేటాయించడం, కామినేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి విజయం సాధించి.. మంత్రి పదవి కూడా చేపట్టడం తెలిసిందే. సామాజిక వర్గం ఆధారంగా కామినేనికి ఇక్కడ బలం ఉన్నప్పటికీ.. ఇటీవల కేంద్రం-రాష్ట్రా నికి మధ్య ఏర్పడిన వివాదం.. సహా చంద్రబాబు-రాష్ట్ర బీజేపీ నేతలకు మధ్య పెరిగిన అంతరం నేపథ్యంలో కామినేని ఏకంగా రాజకీయాల్లో ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.నిజానికి ఆయన టీడీపీలోకి చేరిపోతారని అందరూ అనుకున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, రాష్ట్రంలోని బీజేపీ నేతలు చంద్రబాబును తిడుతున్నా కూడా కామినేని మాత్రం బాబుకు అనుకూలంగా మాట్లాడడం వంటివి.. ఆయన పార్టీ మారతారనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చాయి. ఇక, బీజేపీ-టీడీపీ వివాదం నేపత్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలోనూ ఆయన బీజేపీ వైఖరిపై ముభావంగా కనిపించారు. ఈ పరిస్థితి కూడా ఇక, కామినేని టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అందరూ అనుకున్నారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్న కామినేని.. తర్వాత బీజేపీలోకి చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అనుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే, రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్ప డం గమనార్హం. ఇక, కైకలూరులో టీడీపీ పరిస్థితిని గమనిస్తే.. 2009లో జయమంగళ వెంకటరమణ స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఇదే కామినేనిపై ఆయన కేవలం వెయ్యి ఓట్లతేడాతోనే గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఈ నియోజ కవర్గంలో కాంగ్రెస్ కంచుకోటను ఏర్పాటు చేసుకుంది. అయితే, 2009లో వైఎస్ హవా ఉన్నప్పటికీ ఇక్కడ తొలిసారి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ట్రయాంగిల్ ఫైట్‌లో ఓట్ల చీలిక ఆయనకు ప్లస్ అయ్యింది.2009 ఎన్నికల్లో గెలుపు తర్వాత వాస్తవానికి ఇక్కడ టీడీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన ఈ సీటులో ఇప్పుడు టీడీపీ ఎవరికి అవకాశం ఇస్తుందా? అనే విషయం చర్చ నీయాంశంగా మారింది. మచిలీ పట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రంగంలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. లేకపోతే.. అవనిగడ్డ నుంచి గత ఎన్నికల్లో చాన్స్ మిస్సయిన అంబటి బ్రాహ్మణయ్య ఫ్యామిలీకి దీనిని కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే జయమంగళ సీటు నాదే అంటున్నారు. అలాగే ఎంపీ మాగంటి అసెంబ్లీకి వెళితే ఇక్కడ నుంచే పోటీ చేస్తారని కొందరు అంటున్నారు. ఇక కామినేని పార్టీ మారితే ఆయనకే బాబు సీటు ఇస్తారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.