వచ్చే ఎన్నికల్లో ఏ పొత్తులూ పొడుపులూ లేవని తేలిపోవడంతో బీజేపీ మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాలోచూస్తే ఒక్క విశాఖ సిటీలోనే కాస్తాంత పట్టు ఉంది. ఎపుడో 80 దశకంలో బీజేపీ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ని గెలుచుకుంది. ఆ తరువాత టీడీపీ ఆవిర్భావంతో బీజేపీ వెనక బెంచికి వెళ్ళిపోయింది. ఇక టీడీపీతో పొత్తు ఉంటేనే ఒకటీ అరా సీట్లను గెలుచుకోవడం లేకపోతే పడకేయడం కమలం పార్టీకి అలవాటుగా మారిపోయింది. 1999 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ద్వారా అప్పటి విశాఖ వన్ సీటును గెలుచుకున్న బీజేపీకి తిరిగి 2014 ఎన్నికల్లోనే ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంది. ఇలా ఉన్న బీజేపీ ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేయాలనుకోవడం సాహసమే అవుతుంది.బీజేపీకి మొత్తం సీట్లకు పోటీ చేయాలని ఉన్నా కనీసం నిలబడేందుకు కూడా ఓ మాదిరి అభ్యర్ధులు లేకుండా పోయారు. విశాఖ సిటీలోనే ఆ పార్టీకి అన్ని చోట్లా క్యాండిడేట్లు దోరకడం కష్టమని అంటున్నారు. విశాఖ ఉత్తరం సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ వైపు చూస్తున్నారు. అక్కడ కనుక టికెట్ కంఫర్మ్ కాకపోతే ఈసారి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఇక విశాఖ ఎంపీ గా ఉన్న సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సైతం పోటీకి విముఖంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ద్వితీయ స్థాయి నాయకులే ఆ పార్టీ నుంచి బరిలోకి నిలవాల్సి ఉంటుందేమో.ఇక బీజేపీకి ఓ స్థాయి ఉందనుకున్న రోజుల్లోనే విశాఖ వన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీకి పెడితే కేవలం పదిహేను వందల ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడికి ఆ పార్టీకి చెందిన గట్టి నాయకులంతా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. ఇపుడు టీడీపీతో పొత్తు పెటాకులు అయ్యాక బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఆ పార్టీ తరఫున ఎవరైనా ధైర్యం చేసి నిలబడినా జనాలు ఓటు వేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీని జనాల్లో దోషిగా నిలబెట్టడంలో టీడీపీ విజయం సాధించింది ఇక ప్రత్యేక హోదా తో పాటు వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వలేదని, విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయలేదని జనం గుస్సా మీద ఉన్నారు.విశాఖ సిటీ వరకూ ఇలా ఉంటే విశాఖ రూరల్లో అనకాపల్లి తప్ప, మిగిలిన చోట బీజేపీ అంటే జనాలకు బొత్తిగా తెలియదు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే ఆ పార్టీని దాదాపుగా ప్రజలు మరచిపోయారు. బీజేపీ సైతం పొత్తులతోనే కాలక్షేపం చేస్తూ మిగిలిన జిల్లాలో పార్టీ తరఫున పోటీ చేయకుండా మానేసింది. అలాగే పార్టీ విస్తరణ కూడా ఆగిపోయింది. ఓ వైపు టీడీపీ, మరో వైపు వైసెపీ, జనసేన వంటి బలమైన పార్టీలు పోటీలో ఉంటే బీజేపీని జనం చూస్తారా. ఓటు వేస్తారా అన్న చర్చ సాగుతోంది. వీటన్నిటి కంటే ముందు మొత్తం సీట్లకు అభ్యర్ధులు దొరుకుతారా అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది.