రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడి నిలువుగా వంచించారని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్ బాబు విమర్శించారు. క్విట్ మోడీ... మోసకారి మోడీని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫొరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో గుంటూరు చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐఈటీ) ఆవరణలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు సభకు అధ్యక్షత వహించారు. అశోక్ బాబు మాట్లాడుతూ విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఒక్కటే దన్నుగా నిలవగలదన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలను నయవంచన చేసిందన్నారు. నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చే వారికి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. హోదా, విభజన హామీలను అమలు చేయని బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీకి అంగీకరించడం కూడా తప్పిదమేనని స్పష్టం చేశారు. మన రెక్కల కష్టంలో నిర్మించుకున్న రాజధాని హైదరాబాద్ను కోల్పోయామని, అక్కడి ఆస్తుల పంపిణీలోనూ మనకు అన్యాయం జరిగిందని ఐటీ జేఏసి నాయకులు మానం బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ''జై ఆంధ్రప్రదేశ్'' నినాదంతో ఏపీజేఎఫ్ తలపెట్టిన ప్రత్యేక హోదా ఆత్మగౌరవ ఉద్యమంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి ఇవ్వవలసిన వాటికన్నా ఎక్కువ ఇచ్చామని బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడటం ఇక్కడి ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఇక్కడి నాయకులు హోదా, విభజన హామీల విషయంలో అధిష్టానాన్ని ప్రశ్నించాలని సూచించారు. హోదా, విభజన హామీలను అమలు చేయకుంటే బీజేపీ నాయకులను ప్రజలు తిరగనివ్వబోరని హెచ్చరించారు. హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ నాయకులను సాంఘీక బహిష్కరణ చేయాలని ఇండియన్ యుగానియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బహీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినపుడూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, తెలంగాణా నుంచి విడిపోయిన తరువాత మరింత నష్టం జరిగిందని 'హోదా' ఉద్యమ నాయకులు అవధానుల హరి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని అన్నా హజారే టీమ్ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవపల్లి శివరావు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో నిలవాలని సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యూష సుబ్బారావు అన్నారు. సామాజిక బాధ్యతతో తమ కళాశాలలో ప్రత్యేక హోదా డిమాండ్పై సభ నిర్వహించుకునే అవకాశం కల్పించామని చలపతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సత్యనారాయణ అన్నారు. హోదా ఉద్యమంలో గిరిజనులు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతారని నంగారాభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.చంద్రానాయక్ అన్నారు. ప్రజా నాయకుడు పి.వి.రమణ, ఏపీజేఎప్ నాయకులు రంగారావు, పి. శ్రీనివాసరావు, సూర్యా, రాజేష్, జహరుల్లా, హలీమ్, సాయినరేష్ తదితరులు ఈ సభలో మాట్లాడారు.