YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆశించని ఫలితాలివ్వని సంక్రాంతి మూవీస్

 ఆశించని ఫలితాలివ్వని సంక్రాంతి మూవీస్

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలు థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్‌తో మొదలైన ఈ సినీ పండుగ.. వరుసగా.. జనవరి 10 రజినీకాంత్ ‘పేట’.. 11న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’.. 12న వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ మూవీ ‘F2’లతో ముగిసింది. మొత్తంగా సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద పుంజులు బాక్సాఫీస్ బరిలోకి దిగిపోయాయి. సంక్రాంతి సీజన్ కావడం అందులోనూ నాలుగూ పెద్ద హీరోల సినిమాలే కావడంతో కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టాయి. భారీగా విడుదల చేయడంతో ప్రారంభ కలెక్షన్లతో సంబంధం లేకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే చిత్రం ఈ నాలుగు సినిమాల్లో ఏది అనే విషయానికి వస్తే.. ఆ నాలుగు సినిమాల్లో రెండు చిత్రాలు ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్‌గా ఉన్నాయి. అందులోనూ ఒకటి ఒక వర్గం ప్రేక్షకులు ఆహో ఓహో అంటున్నా.. కామన్ ఆడియన్స్ నుండి పెదవి విరుపులు లేకపోలేదు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ చూసిన ప్రేక్షకులకు ఓ మంచి ఎక్స్‌పీరియన్స్‌ అయితే కలగడం ఖాయమే. అయితే టాలీవుడ్‌ బయోపిక్ ట్రెండ్ సెట్టర్ మూవీ ‘మహానటి’తో పోల్చుకుంటే.. ఎమోషనల్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిందనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. అయితే నందమూరి అభిమానులకు ఈ సినిమా సంక్రాంతి పండగనే చెప్పాలి. ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ లాంగ్ రన్‌లో పరిస్థితి ఏంటి అన్నది తెలియాలంటే మరోవారం గడవాల్సిందే. ఇక 10 విడుదలైన రజినీకాంత్ రీమేక్ మూవీ ‘పేట’ కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ.. ఆయన్ని స్క్రీన్స్‌పై చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రజినీ స్టైల్‌కి ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకి యావరేజ్ టాక్ దక్కింది. అయితే తెలుగులో ఈ సినిమా ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. థియేటర్స్ లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్‌గా మారింది. ఇక మూడో సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతి బరిలో ఈ ఏడాది నిలిచిన నాలుగు పెద్ద చిత్రాల్లో భారీ అంచనాలు ఉన్న చిత్రం ఇదే. రంగస్థలం సినిమాతో మార్కెట్ రేటు రెండింతలు పెంచుకున్న రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్‌ మూవీ అంటూ హిట్ పక్కా అనే ధీమా వ్యక్తమైంది. అయితే సినిమా విడుదల తరువాత లెక్కలు మారిపోయాయి. ప్రేక్షకుల అంచనాలకు ఆమడ దూరంలోనే ఆగిపోయాడు విధేయ రాముడు. కలెక్షన్ల పరంగా తొలిరోజు రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పటికీ.. టాక్ ఆశాజనకంగా లేదు. అయితే ఈ ఓటమికి పూర్తి బాధ్యత దర్శకుడు బోయపాటి వహించాల్సిందే. చరణ్ కష్టపడ్డాడు.. కాని ఆ కష్టానికి ఫలితం లేకుండా చేశారు దర్శకుడు. ఇక నాలుగో సినిమా చివరిది వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘F2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్).. జనవరి 12న విడుదలైన థియేటర్స్‌లో నవ్వులు జల్లు కురిపిస్తుంది. సంక్రాంతి నాడు హాయిగా ఫ్యామిలీతో కలిసి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవడానికి ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్ ‘F2’ అనే చెప్పాలి. చానాళ్ల తరువాత వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ టైమింగ్‌కి దర్శకుడు రైమింగ్ తోడుకోవడంతో ఫన్‌తో పొట్టచెక్కలు అవుతుంది. అయితే రొటీన్ కథనే ఫ్రెష్‌గా ప్రజెంట్ చేయడంతో సక్సెస్ బాట పట్టాడు దర్శకుడు. సో ఈ సంక్రాంతికి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమైతే ‘F2’ అనే చెప్పాలి. అంతేగా.. అంతేగా..!! 

Related Posts