ర్ణాటక సంకీర్ణ సర్కార్ లో తండ్రి, కొడుకులు ఇమడ లేకపోతున్నారా…? పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు విముఖత వ్యక్తం చేస్తున్నారా? బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ పైనే దేవెగౌడ, కుమారస్వామిలు మొగ్గుచూపుతున్నారా? అంటే అవుననే సమాధానాలు విన్పిస్తున్నాయి. హస్తిన కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు సంకీర్ణ సర్కార్ కు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ విడిగా పోటీ చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. యూపీ మాదిరిగానే ఇక్కడా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు.సంకీర్ణ సర్కార్ ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు పైగానే గడుస్తున్నా కుమారస్వామి ఏరోజూ మనశ్శాంతిగా పాలన చేయలేదంటున్నారు ఆ పార్టీ నేతలు. తమపై కాంగ్రెస్ పార్టీ పెత్తనాన్ని వారు సహించలేకపోతున్నారు. కుమారస్వామి మాటల్లోనూ ఈ విషయం అనేకసార్లు స్పష్టమయింది. ఇటీవల మళ్లీ తాను ముఖ్యమంత్రిని కాదని, గుమస్తాను మాత్రమేనని, కాంగ్రెస్ చెప్పినదానికల్లా తలాడించాల్సి వస్తుందని ఆయన ఆవేదన ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పొత్తుపై పడుతుందంటున్నారు.తర్వాత తాను అలా అనలేదని కుమారస్వామి పైకి చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ ఆదేశాలను మాత్రమే కుమారస్వామి పాటించాల్సి వస్తుందన్నది అక్షర సత్యం. అతి తక్కువ స్థానాలతో ముఖ్యమంత్రి పదవి దక్కిందన్న సంతోషం కన్నా, పాలనలో తన మార్కు చూపించలేకపోతున్నానన్న ఆవేదనే ఆయనలో ఇటీవల ఎక్కువగా కనపడుతోంది. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో గొడవలు పెట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుందని కూడా ఆయనకు తెలియంది కాదు. అందుకనే ఆయనకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ ను కట్టడి చేయాలని యోచిస్తున్నారు.దళపతి దేవెగౌడ సయితం కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో తన పాత్ర ఉండాలని యోచిస్తున్న దేవెగౌడ కాంగ్రెస్ కొంగు పట్టుకుని వెళితే ఫలితం ఉండదని భావిస్తున్నారు. ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ కు చెక్ పెట్టాలంటే ఒంటరిగానే బరిలోకి దిగడం బెటర్ అని భావిస్తున్నారు. తాము కోరుకున్నట్లు 12 పార్లమెంటు స్థానాలు ఇస్తే ఒకే అని, లేకుంటే అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని దేవెగౌడ పార్టీ నేతలకు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగి అత్యధిక స్థానాలు గెలుచుకుంటే అన్ని పార్టీలూ తమ గేటు వద్దకు వస్తాయని ఆయన భావిస్తున్నారు. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిల మధ్య పొత్తు ఉండదన్న సంకేతాలు బలంగా విన్పిస్తున్నాయి