Highlights
- ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన సిబిఐ
- పీఎన్‌బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి,
- మరో ఉద్యోగి మనోజ్ ఖరాజ్
- నీరవ్ మోదీ గ్రూప్‌కు చెందిన హేమంత్ భట్‌ల అరెస్ట్
- బ్యాంక్ ఉద్యోగులను 18 మందిపై సస్పెండ్ వేటు
- భాగస్వామి మెహుల్ చౌకసికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు
11 వేల 300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.11 వేల 300 కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఉచ్చు బిగుస్తోంది. దేశం విడిచి పారిపోయిన నీరవ్ ఆచూకి కోసం సిబిఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. నీరవ్‌తో పాటు ఆయన మేనమామ మెహుల్ చోక్సిల పాస్‌పోర్టులను విదేశాంగశాఖ 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. విచారణకు హాజరు కావాలని నీరవ్ మోదీకి ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణంలో పీఎన్‌బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, మరో ఉద్యోగి మనోజ్ ఖరాజ్‌తో పాటు నీరవ్ మోదీ గ్రూప్‌కు చెందిన హేమంత్ భట్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ చౌకసికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వారంలోగా వీరిద్దరు ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
పిఎన్‌బి స్కాంలో దేశం విడిచి పారిపోయిన నీరవ్‌తో పాటు ఆయన మేనమామ మెహుల్ చోక్సిల పాస్‌పోర్టులను విదేశాంగశాఖ 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ చర్య తీసుకోకుండా ఉండాలంటే, వారంలోగా తగిన కారణాలను చూపించాలని వారిని విదేశాంగ శాఖ కోరింది. వీరు సరైన కారణాలను చూపించకపోతే నాలుగు వారాల అనంతరం వీరిద్దరి పాస్‌పోర్టులను పూర్తిగా రద్దు చేస్తారు.
నీరవ్‌మోదీ న్యూయార్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన జేడబ్ల్యూ మరియట్ ఎస్సెక్స్ హౌస్‌లో ఉన్నారు. ఆయన భార్య పేరిట తీసుకున్న ట్రిపుల్ బెడ్ రూమ్స్ సూట్‌లో ఒక రాత్రికి లక్ష చెల్లిస్తున్నట్లు సమాచారం.
నీరవ్ మోది కోసం సిబిఐ వేటాడుతోంది. నీరవ్ మోదితో పాటు ఆయన భార్య అమీ మోది, సోదరుడు నిశాల్ మోది, గీతాంజలి ప్రమోటర్ మెహుల్ చౌకసీలను పట్టుకునేందుకు సిబిఐ ఇంటర్‌పోల్ సాయం కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 11 వేల 3 వందల కోట్లకు పైగా మోసగించిన నీరవ్ మోది- కుంభకోణం బయటపడే ముందే గత నెల మొదటి వారంలో కుటుంబంతో సహా విదేశాలకు చెక్కేశారు.
నీరవ్‌మోదీ, మరో ఆభరణాల కంపెనీ తమ బ్యాంకు ద్వారా మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు పీఎన్‌బీ జనవరి 28న సిబిఐకి ఫిర్యాదు చేసింది. పీఎన్‌బీ నుంచి అక్రమంగా లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లను తీసుకెళ్లి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి రుణాల పొందినట్లు పేర్కొంది. జనవరి 31న కేసు నమోదు చేసిన సిబిఐ విచారణ చేపట్టింది. నీరవ్, ఆయన భార్య, సోదరుడు, చోక్సీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఉన్న నీరవ్ ఆస్తులు, గీతాంజలి జెమ్స్ షోరూంలపై గురువారంనాడు ఈడీ దాడులు చేసింది. 5,100 కోట్లు విలువచేసే బంగారం, వజ్రాలు, ఇతర ఖరీదైన స్టోన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది.