ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ… ఏపీకి రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటు అధికార పార్టీతో పాటు అటు వైసీపీలోనూ సీట్ల కొట్లాటలు షురూ అయినట్టుగానే తెలుస్తోంది. అధికార టీడీపీలో పరిస్థితి కాస్తంత గుంభనంగానే ఉన్నా… వైసీపీలో మాత్రం ఈ కొట్లాటలు రచ్చకెక్కుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా పరిస్థితి ఉన్నా.. కీలక జిల్లాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా రచ్చలు వైసీపీకి పెద్ద తలనొప్పిగానే పరిణమించాయని సమాచారం. కృష్ణా జిల్లాలో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడలో దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు ఇప్పటికే పార్టీలో టికెట్ రాదని తేలిపోగా… ఇప్పుడు గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న సత్తెనపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న కీలక నేత అంబటి రాంబాబుకు కూడా ఈ దఫా సీటు దక్కదన్న పుకార్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి. పార్టీలో ఓ మోస్తరు స్టామినా కలిగిన నేతలుగా ఉన్న వీరిద్దరికే ఈ దఫా టికెట్లు దక్కడం లేదంటే… ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ నేతలకు సంబంధించి పార్టీ అథిష్ఠానం భావన ఎలా ఉందన్న విషయానికి వస్తే… విజయవాడలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వంగవీటి రాధా… నగరంలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొన్నటిదాకా అక్కడి నుంచి ఆయనే బరిలోకి దిగుతారని పార్టీ నేతలంతా భావించినా… కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చి చేరడంతో రాధా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయని, మల్లాది విష్ణు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్న నేపథ్యంలో రాధా కంటే కూడా విష్ణుకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని వంగవీటికి చేరవేసిన పార్టీ సీనియర్లు… సెంట్రల్ కంటే కూడా కాపుల ఓట్లు అధికంగా ఉన్న విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దిగాలని రాదాకు సూచించారు. అంతేకాకుండా గడచిన ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గాన్ని వదిలి సెంట్రల్‌కు వచ్చిన రాధా ఓటమి చవిచూశారు. ఈ విషయాన్ని కూడా పార్టీ అథిష్ఠానం వంగవీటికి సూచించిందట. అయితే రాధా ఇందుకు ససేమిరా అనడంతో తూర్పు వద్దనుకుంటే.. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని, ఈ పోటీతో పార్టీకి కూడా మంచి మైలేజీ ఉంటుందని కూడా పార్టీ సూచించిందట. అయితే ఈ ప్రతిపాదనకు కూడా రాధా ఓకే అనకపోవడంతో… ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టేసిందట. ఇప్పుడు సెంట్రల్ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాలకు అభ్యర్థలు ఖరారు కావడంతో రాధాకు ఈ దఫా టకెట్ కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్నమీదటే… రాధా కూడా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే.. గడచిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అంబటి… స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్‌కు గట్టి పోటీనే ఇచ్చారు. ఒకానొక సమయంలో అంబటి గెలిచిపోయారన్న మాట కూడా వినిపించింది. అయితే కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో కోడెల విజయం సాధించారు. నాటి నుంచి పార్టీ తరఫున తురుపు ముక్కగానే వ్యవహరిస్తున్న అంబటి… రాష్ట్ర స్థాయి పాలిటిక్స్‌పై మాత్రమే దృష్టి సారించి సొంత నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవడం మానేశారట. దీంతో అసలే కరడుగట్టిన టీడీపీ నేతగా ఉన్న కోడెల నుంచి దాడులు ఎదురవుతున్న నేపథ్యంలో అండగా నిలవాల్సిన అంబటి… అసలు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి మినహా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే గానీ… అంబటికి మాత్రం టికెట్ ఇస్తే… సహకరించేది లేదని ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు నేరుగా అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారట. దీంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న పార్టీ అధిష్ఠానం ఈ దఫా అంబటిని పోటీకి దూరంగా పెట్టేసేందుకే నిర్ణయించుకుందట. ఇదేనిజమైతే…అంబటి కూడా రాధా బాటే పడతారో, లేదంటే పార్టీ వ్యవహారాలకు పరిమితమవుతారో చూడాలి