వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌ను 9గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 10,831 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుండగా.. తాజా నిర్ణయంతో మరో 2,800 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.వ్యవసాయ రంగానికి అదనంగా ఇస్తామంటున్న రెండు గంటల విద్యుత్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలగనుంది.ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సబ్సడీ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ.6,030 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజా నిర్ణయంతో మరో రూ.1200 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి 22 మిలియన్ యూనిట్ల విద్యుత్‌లోటులో ఉన్నప్పటికీ పలు సంస్కరణలు తీసుకొచ్చి ఉత్పత్తి సామర్థ్యం పెంచటం వల్ల ఉత్పత్తి సామర్థ్యం 18వేలకు పెరిగింది. రైతులకు సౌర విద్యుత్‌తో నడిచే పంపుసెట్ల పంపిణీ కార్యక్రమాన్ని సైతం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16లక్షల పంపుసెట్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, వాటిని గ్రిడ్‌కు అనుసంధానించటం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా 30శాతం విద్యుత్ ఆదా అవుతుందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది. ఏటా 2,625 కోట్ల రూపాయల ఖర్చుతో 75వేల సౌర పంపుసెట్లను అమర్చాలని ఇంధనశాఖ యోచిస్తోంది.