YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పిలుస్తోంది ఆధ్యాత్మిక సమ్మేళనం!

పిలుస్తోంది ఆధ్యాత్మిక సమ్మేళనం!

ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజలో 49 రోజుల పాటూ జరిగే ఈ ఆధ్యాత్మిక ఘట్టానికి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. జనవరి 15 న మొదలయ్యే కుంభమేళా మార్చి 4న ముగుస్తుంది. ఈ మేళా కు 120 మిలియన్ల యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గట్లుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించింది. యాత్రికుల సౌకర్యార్ధం అతి పెద్ద తాత్కాలిక నగరాన్ని నిర్మించారు. దాదాపు రెండువేల కోట్ల రూపాయలు దీనికి వెచ్చించారు. దాదాపు 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లను నిర్మించారు. ఇరవైకి పైగా పంటూన్‌ వంతెనలు వేశారు. భద్రతను కూడా భారీగానే ఏర్పాటుచేశారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా సెక్యూరిటీని పర్యవేక్షిస్తారు. యాత్రికులను ఘాట్లకు చేర్చడానికి పెద్దఎత్తున రవాణా సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి. భక్త పారవశ్యం వెల్లువెత్తే కుంభమేళా అచంచల విశ్వాసానికి తార్కాణం. కోట్లాది ప్రజలు ఒకే చోట చేరి పవిత్ర స్నానాలు ఆచరించే అద్భుత ఘట్టం. ఈ అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళానికి భారత్ తో పాటూ సుమారు 192 దేశాల నుంచి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 71 దేశాలకు చెందిన రాయబారులు కూడా కుంభమేళాను సందర్శించనున్నారు. కుభమేళాకు హాజరయ్యేందుకు అనేకమంది నిజామాబాద్ నుంచీ తరలివెళ్తున్నారు.

కుంభమేళాలో కొన్ని రోజులు ఉంటాయి. వీటిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. కుంభమేళా తొలి రోజున వివిధ అఖారాలకు చెందిన వారూ, నాగ సాధువులూ పెద్ద సంఖ్యలో హాజరవుతారు. షాహి స్నానం లేదా రాజ యోగి స్నానం ఆచరించి కుంభమేళాను ప్రారంభిస్తారు. షాహి స్నానాలు పూర్తయిన తరువాత మాత్రమే ఇతర భక్తుల్ని అనుమతిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతం కోసం దేవతలకూ, రాక్షసులకూమధ్య జరిగిన పెనుగులాటలో నాలుగు అమృత బిందువులు హరిద్వార్‌, ఉజ్జయిని, ప్రయాగ, నాసిక్‌లలో పడ్డాయనీ, గరుత్మంతుడు అమృతభాండం తెస్తూండగా నేలపై సుధా బిందువులు చిలికాయనీ పురాణ కథనాలు ఉన్నాయి. అమృత స్పర్శతో పునీతమైన చోట్లు కాబట్టి, ఆ ప్రదేశాల్లో స్నానం ఆచరించడం పుణ్యప్రదమని పెద్దలు చెబుతారు. ఆ కారణంగానే ఆ నాలుగు ప్రాంతాలూ అనాదిగా కుంభమేళాలకు వేదికలయ్యాయి. దేశంలోని నాలుగు ప్రసిద్ధ క్షేత్రాల్లో పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు, గురువు నిర్ణీత రాశులలో ఉన్నప్పుడు వీటిని నిర్వహిస్తారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌లో గంగానది వద్ద, మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలోని త్రయంబకేశ్వర్‌లో గోదావరి నది వద్ద, మధ్యప్రదేశ్‌ని ఉజ్జయినిలో క్షిప్రానది వద్ద, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద కుంభమేళాలు జరుగుతాయి. అలాగే హరిద్వార్‌, ప్రయాగల్లో ఆరేళ్ళకు ఒకసారి అర్ధ కుంభమేళాలు నిర్వహిస్తారు. వేల సంవత్సరాల క్రితం నుంచీ కుంభమేళాలు జరుగుతున్నాయనడానికి పౌరాణికంగానే కాకుండా చారిత్రకంగా కూడా ఆధారాలు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. 

Related Posts