YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అపూర్వం..మకరజ్యోతి దర్శనం

అపూర్వం..మకరజ్యోతి దర్శనం

శబరిమలలో లక్షలాది మంది ‘మకరజ్యోతి’ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. దీంతో అయ్యప్పదీక్షలు పరిసమాప్తమయ్యాయి. అయ్యప్ప సన్నిధానం అంతా భక్తజనసందోహంతో కిటకిటలాడిపోయింది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న భక్తుల స్వరాలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. ప్రపంచం నలుమూలల నుంచి వెల్లువెత్తిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోరికలను ఈడేర్చడానికి తాను ఆలయంలో కొలువు తీరుతానని అయ్యప్ప మాట ఇచ్చాడు. తన మాట నమ్మి శబరిమలకు వచ్చిన భక్తులకు జ్యోతిస్వరూపంతో దర్శనం ఇస్తాడు స్వామి. ఈ దర్శనం కోసమే మండలం రోజుల నుంచి నియమనిష్ఠలతో భక్తులు ఎదురుచూస్తారు. తండ్రి అనుమతి తీసుకొన్న అయ్యప్ప జ్యోతిస్వరూపం అయ్యాడు. ఏటా తనను చూడాలనుకొనేవారికి సంక్రాంతినాడు జ్యోతిస్వరూపుడై దర్శనం ఇస్తానని మాట ఇచ్చాడు. అప్పటి నుంచే సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనం కోసం మాలధారులంతా శబరిమల వెళ్తారు. శబరిమలకు వెళ్లే వారిలో తెలుగురాష్ట్రాలకు చెందిన భక్తులూ అధికంగానే ఉంటారు. నిష్టగా దీక్ష పాటించి అయ్యప్పను కొలుస్తారు. మకరజ్యోతి దర్శనంతో శబరిమల వాతావరణం అపూర్వంగా మారిపోయింది. భక్తపారవశ్యం వెల్లువెత్తింది. 

శబరిమలై ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి నాడే అయ్యప్ప జ్యోతిని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. సంక్రాంతి రోజున  స్వామివారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. వీటిని తిరువాభరణాలు అంటారు. పందళ రాజులు స్వామికి ఆప్యాయంగా చేయించిన బంగారు నగలనే తిరువాభరణాలు అంటారు. వీటిని వెయ్యిళ్ల కిందట చేయించినట్లు పేర్కొంటారు. అప్పటి నుంచి ఈ ఆభరణాలు పందళరాజు ఆధీనంలో ఉన్నాయి. వీటిని సన్నిధానానికి మోసుకెళ్లే విధిని పందళంలోని ఈ కుటుంబానికే వారసత్వంగా వస్తోంది. తిరువాభరణాలను కేవలం మకర విలక్కు సమయంలో స్వామికి అలకరిస్తారు. ఆ తర్వాత ఏడాది అంతా పందళ రాజ ప్రసాదం స్రంపికల్ భవనంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. మకర జ్యోతికి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండల పూజ సమయంలో ఈ ప్రాంతంలో దర్శించుకోవచ్చు. తిరువాభరణాలు మోసేవారు కూడా అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. మొత్తంగా శబరిమలలో మకరజ్యోతి దర్శనంతో భక్తజనం పులకించింది. 

Related Posts