YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం 25వేల ఎకరాల్లో ఏర్పాటు, సామర్థ్యం 5వేల మెగావాట్లు,2023 కల్లా నిర్మాణం పూర్తి

ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం 25వేల ఎకరాల్లో ఏర్పాటు, సామర్థ్యం 5వేల మెగావాట్లు,2023 కల్లా నిర్మాణం పూర్తి

పర్వతాలు, సరస్సులు, ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్‌ కర్మాగారం ఏర్పాటుకానుంది. 25వేల ఎకరాల్లో ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఒకే ప్రాంతంలో ఇంత భారీ విస్తీర్ణంలో ఇప్పటివరకూ ఏ సౌర విద్యుత్‌ కర్మాగారామూ ఏర్పాటు కాలేదు. జమ్మూకశ్మీర్‌లో  ఉన్న కార్గిల్‌లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరొకదాన్ని నిర్మించనున్నారు. ఈ రెండు కర్మాగారాల ద్వారా ఏటా 12,750 టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకునే అవకాశం ఉంది. స్థానిక ప్రజలకు జీవనోపాధి కలగడంతోపాటు సంవత్సరంలో ఏడెనిమిది నెలలు విద్యుత్‌ కోసం డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నేతృత్వంలోని భారత సౌర విద్యుత్‌ సంస్థ (ఎస్‌ఈసీఐ) ఈ కర్మాగారాల నెలకొల్పనకు కృషి చేస్తోంది. రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో 2023 కల్లా వీటిని నిర్మించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. లద్దాఖ్‌లోని హన్లె ఖాల్డో, కార్గిల్‌లోని సురుల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. లద్దాఖ్‌లో ఉత్పత్తైన విద్యుత్‌ను హరియాణాలోని కైథల్‌కు సరఫరా చేస్తారు. ఇందుకోసం లెహ్‌-మనాలీ మార్గం వెంబడి 900 కి.మీ.ల మేర లైన్‌ వేయనున్నారు. కార్గిల్‌ ప్రాజెక్టును శ్రీనగర్‌కు సమీపంలోని న్యూ వాన్‌పోలో ఉన్న గ్రిడ్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన భూములపై లెహ్‌, కార్గిల్‌ పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్లకు ఏటా హెక్టార్‌కు రూ.1200 (3% వార్షిక పెంపు) చొప్పున అద్దె రూపంలో ఆదాయం వస్తుందని ఎస్‌ఈసీఐ డైరెక్టర్‌ (పవర్‌ సిస్టమ్స్‌) ఎస్‌కే మిశ్ర తెలిపారు.

Related Posts