సంక్రాంతి సంప్రదాయం ముసుగులో భోగి పండుగ రోజైన టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు బరుల వద్దే ఉండి మరీ కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు బరులను తొలగించిన కొద్ది సేపటికే అక్కడికి వచ్చి పందేలను తిరిగి ప్రారంభించారు. ఎవరూ అడ్డుకోరు పందేలను నిర్వహించుకోవాలని పందెంరాయుళ్లకు ధైర్యం చెప్పారు. అంతే పందెం రాయుళ్లు రెచ్చిపోయారు.సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగాయి. అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నప్పటికీ రేపల్లె, కొల్లిపర సహా వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కోడి పందేలతో పాటు డబ్బా, చక్రం ఆటలు(జూదాలు) జోరుగా సాగాయి. జూదాలకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండలతో చట్టబద్ధత కల్పించినట్లైంది. పేకాట (కోతముక్క), డబ్బా, చక్రం ఆటలతో పాటు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంప్రదాయాల ముసుగులో గ్రామీణుల జీవితాలు చిధ్రమవుతున్నాయని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాయకష్టం చేసి సంపాదించుకున్న సొమ్ము జూదం వ్యసనంలో పాడుచేస్తుండటంతో పేదవర్గాలు పండగపూట కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ సాకుచూపి కోడిపందేలు, జూదం వివిధ రకాల ఆటల వల్ల కోట్లాది రూపాయిలు ప్రజాప్రతినిధుల సమక్షంలో చేతులు మారిపోయాయి.సంక్రాంతి పండుగ వచ్చిన ప్రతిసారీ అధికార పార్టీ నేతలు, పోలీసుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పరిపాటిగా మారాయి. ఏడాది కూడా ఖాకీలపై ఖద్దరుదే పైచేయిగా నిలిచింది. అనుమతులు లేవని చెబుతున్న పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి బరివైపు తొంగి చూడకుండా అధికార పార్టీ నేతలు చేశారు. జిల్లాలోని డెల్టాప్రాంతంలో ఏటా కోడిపందెలు భారీ ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆనవాయితీ కాస్తా జూదంగా మారి రూ.లక్షల్లో కోడి పందేలు సాగుతున్నాయి. అదే ప్రాంగణంలో భారీ ఎత్తున పేకాట, గుండు ఆట వంటి జూద క్రీడలను నడుపుతున్నారు. డెల్టా ప్రాంతం గుర్తుకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. డెల్టాప్రాంతంలో అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా అనుమతులు లేకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు దగ్గరుండి కోడిపందేలు ప్రారంభించి నిర్వహించడంతో పోలీసు అధికారులు సైతం అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయలేదని తెలుస్తోంది. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో సోమవారం భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. నాలుగేళ్లుగా రేపల్లె మండలం బొబ్బర్లంక, గుడికాయలంక గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించిన పందెం రాయుళ్లు ఈ ఏడాది అదే నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, రేపల్లె మండలం గుడ్డికాయలంక, నగరం మండలం ఉయ్యూరువారిపాలెం, నిజాంపట్నం మండలం ఆముదాలపాలెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లో కోడిపందేలు భారీగా ఎత్తున నిర్వహించారు. ఈ కోడిపందేల్లో రూ.లక్షల్లో చేతులు మారాయని సమాచారం.తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మరీ కోడిపందేలు ప్రారంభించారు. కొల్లిపర మండలం కొత్తబొమ్మునివానిపాలెంపుష్కరఘాట్ వద్ద టీడీపీ నాయకులు కోడిపందేలకు బరులను ఏర్పాటు చేశారు. దీనిపై 14వ తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ద్వారా సమాచారం తెలుసుకున్న కొల్లిపర ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం బరుల వద్దకు వెళ్లి అక్కడ టెంట్‌లను ధ్వంసం చేసి 20 మందిని అదుపులోకి తీసుకుని, 10 కోళ్లు, రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అడ్డుకున్న టీడీపీ నాయకులకు కోడిపందేలు చట్టవిరుద్ధమని ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్పి వెళ్లారు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆలపాటికి తెలపడంతో ఆయన 11 గంటల సమయంలో బరి వద్దకు చేరుకుని పందేలు పునఃప్రారంభిం చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరుండి పందేలు నిర్వహింస్తుండటంతో పోలీసులు సైతం అటువైపు వెళ్లలేదు. తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల నడుమ ఆదివారం మొదలైన కోడిపందేలకు తెనాలి, దుగ్గిరాల, వేమూరు నుంచే కాకుండా కృష్ణానది ఆవలగల కృష్ణా జిల్లా నుంచి కూడా పందెపురాయుళ్లు హాజరయ్యారు. స్వయంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్దతు ఉందని తెలియటంతో పోలీసు భయం ఉండదన్న ధీమాతో పందెంరాయుళ్లు నిస్సంకోచంగా పందేలకు పూనుకున్నారు.పోలీస్ ఉన్నతాధికారులపై సైతం అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తీసుకువచ్చి కోడిపందేలు నిర్వహిస్తుండటంతో పోలీస్‌లు ప్రేక్షపాత్ర వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి నియోజకవర్గం నూతక్కి, రేవెంద్రపాడు, కుచనపల్లి, పాతూరుల్లో సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా కోడి పందేలు సాగాయి.