చిత్తూరు జిల్లాలోని మీసేవా కేంద్రాలు 17 నుంచి మూతపడనున్నాయి. రెండు వారాల క్రితం మీసేవా కేంద్ర నిర్వాహకులు సమ్మె నోటీసు జారీ చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆపరేటర్ల సమ్మె ఖాయమైంది. జిల్లాలో 535 మీసేవా కేంద్రాలున్నాయి. 535 మంది ఆపరేటర్లతోపాటు మరికొందరు సహాయకులు వీటిపై ఆధారపడుతున్నారు. చాలీచాలని కమీషన్లు, అధిక పని ఒత్తిడి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన్నిచోట్ల కేంద్రాలు మూతపడ్డాయి. వీరు సమ్మెకు దిగితే పలు సేవలు ఆగిపోనున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులకు యువనేస్తం, కులం, ఆదాయ, స్థిరనివాసం ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు తప్పనట్టే. రైతులకు ఆర్‌ఓఆర్ అడంగుల్, ఈసీ, సీసీ, పట్టాదార్ పాసుపుస్తకాలు, జననమరణ ధ్రువీకరణ పత్రాలు లాంటి ముఖ్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సేవా కేంద్రాలకు తహసీల్దార్ కార్యాయాలకు ఉన్న లింకు తెగినట్టే.రూరల్ మీసేవా కేంద్రాలు 2003లో ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలోసేవలు 2012 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 36 శాఖలకు సంబం ధించిన 440 రకాల సేవలు మీసేవా కేంద్రాలద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. సేవలు పెరిగేకొద్దీ ఆపరేటర్లపై బాధ్యతలు, అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. కమీషన్లు పెంచకపోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోని ఆపరేటర్లకు ప్రభుత్వం 15వేల వేతనాలు ఇవ్వాలని, మీసేవా కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలను మంజూరు చేయాలని వీరు కొన్ని నెలలుగా కోరుతున్నారు. ఆధార్ కమీషన్ బకాయిలు విడుదల కాలేదు. స్కానింగ్ చార్జీ రూ.2 నుంచి రూ.5కు పెంచాలని కోరుతున్నారు.చాలీచాలని కమీషన్లతో కుటుంబాలను పోషిం చడం ఆపరేటర్లకు చాలా కష్టంగా మారింది. మా సమస్యలపై ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులిచ్చాం. సమ్మె గడువు దగ్గరపడుతున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో సమ్మె చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నామని మీసేవా ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు సూర్యకుమార్ తెలిపారు